Site icon vidhaatha

సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా

విధాత, వరంగల్ ప్రతినిధి: సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోకుండా వారిలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్‌ వారియర్ల ప్రధాన కర్తవ్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్స్‌ విభాగం అధ్వర్యంలో కమిషనరేట్‌కు చెందిన సైబర్‌వారియర్లతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సైబర్‌ క్రైమ్స్‌ విభాగం అధికారులు, వివిధ పోలీస్‌ స్టేషన్లకు చెందిన సైబర్‌ వారియర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్ల వారీగా నమోదయిన సైబర్‌ నేరాలపై ఆరా తీయడంతో పాటు సైబర్‌ నేరాల నియంత్రణ కోసం సైబర్‌ వారియర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ బాధితుల సొమ్మును దోచుకొని బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ నేరస్థుడికి సంబంధించి బ్యాంక్‌ ఖాతాలను నిలిపేసిన కేసుల్లో తక్షణమే కేసులు నమోదు చేయాల్సి వుంటుందన్నారు. సైబర్‌ నేరాల్లోని నేరస్తులకు సంబంధించిన పి.టి వారంట్లను పరిష్కరించాలని కోరారు. నిలిపివేసిన నైబర్‌ నేరగాళ్ళ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బు తిరిగి బాధితులకు అందేవిధంగా అధికారులు ప్రభుత్వం సూచించిన ఎస్‌.ఓ.పిని అనుసరించాలన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు స్టేషన్‌ అధికారులు ముందుకు రావాలని సూచించారు.

ప్రధానంగా ప్రజలు సైబర్‌ నేరాలకు గురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సైబర్‌ నేరాలు జరిగే తీరుతెన్నులపై ప్రజలతో పాటు విధ్యార్థులు, యువతకు తెలియజేప్పే విధంగా సైబర్‌ వారియర్లు ముమ్మరంగా అవగహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించే దిశగా స్టేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేశారు.ఈ కార్యక్రమములో అదనపు డిసిపి రవి, సైబర్‌ క్రైమ్స్‌ విభాగం ఏసిపి విజయ్‌కుమార్‌, వర్టికల్స్‌ ఇన్‌చార్జ్‌ ఏసిపి జనార్థన్‌ రెడ్డి, సైబర్‌ క్రైమ్స్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ రవి, ఎస్‌.ఐలు చరణ్‌,శివతో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version