Revanth Reddy | మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే ఆలోచనా విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాడ్సే వారసుల ఆలోచనా ధోరణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశ నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో బుధవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా మోదీ నల్ల చట్టాలు తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. మణిపూర్‌లో మోదీ మంటలు రాజేశారని, దేశ మూలవాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి పదకొండు సంవత్సరాలు దాటిపోయిందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని, మోదీ, అమిత్ షా.. ఈ ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయి కానీ.. ఏటా 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. దేశం నలుమూలల ఉన్న గాంధేయవాదులు మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్‌గాంధీకి అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆలోచనధారతో ఉన్న మనమంతా గాడ్సే వారసులను, మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని చెప్పారు. కుల గణన, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళల సంక్షేమంపై ఆయన ఆ సమయంలో వాగ్దానాలు చేశారని అన్నారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కుల గణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారన్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. రాహుల్ ఇచ్చిన కుల గణన హామీని తాము తెలంగాణలో అమలు చేసి చూపామన్నారు. కుల గణనపై రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడాతారనే భయంతో ఆయనకు లోక్‌సభలో మోదీ ప్రభుత్వం మైక్ ఇవ్వ లేదని మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీకి చోటే లేదు
తెలంగాణలో తాము బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘గుజరాత్ గడ్డపై నుంచి నేను చెబుతున్నా.. మేం నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్‌తో మాకు హృదయపూర్వకమైన బంధం ఉంది. మాకు స్వాతంత్య్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారు. తెలంగాణను మాకు సోనియా గాంధీ అందించింది. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా.. మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం’ అని తేల్చి చెప్పారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు గాంధీజీ అనేక పోరాటాలు చేశారని, కానీ బ్రిటిష్‌వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వారసులు గాంధీజీని హత్య చేశారని చెప్పారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులని వ్యాఖ్యానించారు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని, మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.