Site icon vidhaatha

RS Praveen Kumar | శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో డీజీపీకి ఆరెస్పీ ఫిర్యాదు

నిందితుడు జూపల్లి ఇంట్లోనే ఉన్నారని ఆరోపణలు

విధాత, హైదరాబాద్ : వనపర్తి బీఆరెస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ బీఆరెస్ నేత ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్ సోమవారం మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీ రవిగుప్తాను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆరెస్పీ మీడియాతో మాట్లాడుతూ హత్య జరిగి నాలుగు రోజులైనా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడని, నిందితులు మీ ఇంట్లోనే ఉంటే ఇంక బాధిత కుటుంబానికి న్యాయం ఏం చేస్తారని జూపల్లిపై మండిపడ్డారు.

మేము డీజీపీని డిమాండ్ చేస్తున్నామని, మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదని, వాళ్లు అందరూ జూపల్లి కృష్ణ రావు చెప్పుచేతల్లో ఉన్నారని, వాళ్ల వల్ల మాకు న్యాయం జరగదని ఆరెస్పీ ఆరోపించారు. అందుకే ఈ కేసును ఒక స్పెషల్ టీమ్ పెట్టి విచారణ చేయించాలని కోరుతున్నామన్నారు. మంత్రితో కుమ్మక్కయైన పోలీసులను డిస్మిస్ చేయాలని డీజీపీని డిమాండ్ చేయటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉందని గుర్తుచేశారు. వారంరోజుల్లో న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Exit mobile version