విధాత: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. ఏపీలోప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మహిళలు, బాలికల భద్రత కోసం ‘శక్తి’ యాప్ ను ఆవిష్కరించి ‘శక్తి టీమ్స్’ని ప్రారంభించారు. మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ‘శక్తి టీమ్స్’ను ప్రారంభించినట్లుగా ప్రకటించారు. లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించారు.
ఇక తెలంగాణలో సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళాభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో స్వయం ఉపాధి కార్యక్రమాలకు స్వయం సహాయక సంఘాలలోని కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.
అలాగే గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలన్నిటిని ఒకే గొడుగు కిందకు తేనున్నారు. కొత్తగా కిశోర బాలికలు, వృద్ధులతో గ్రూపులను ఏర్పాటు చేస్తారు. 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు మొదటి విడతగా సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తారు. మిగిలిన 450 బస్సులు త్వరలో అందచేస్తారు. పెట్రోల్ బంక్ లు, సోలార్ విద్యుత్తు ఫ్లాంట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తారు. మహిళా శక్తీ క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి బజార్ కూడా ప్రభుత్వ ఇందిరా మహిళా శక్తి మిషన్ లో భాగమే.