రాజాపూర్ / షాద్‌నగర్, ఆగస్టు 20 (బుధవారం): అగ్రకుల భూస్వామి దళితుల భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో రాజాపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని జాతీయ ఎస్సీ కమిషన్ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
కబ్జా జరిగిందిలా..
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంగర శేఖర్‌కు మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 131ఏలో అరెకరం పొలం ఉంది. ఈ పొలాన్ని 2006లో అదే గ్రామానికి చెందిన రాపల్లె బాలకృష్ణారెడ్డి తల్లి రాపల్లె నాగమ్మ వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఇదే పొలం పక్కన శేఖర్ దాయాదులైన కొంగర అర్జున్, కొంగర జంగయ్య , కొంగర మహేష్‌ల పొలాలున్నాయి. అయితే రాపల్లె బాలకృష్ణారెడ్డి తన పరపతిని ఉపయోగించి అందరి భూములు లాక్కునేందుకు కుట్ర బుద్ధితో తొలుత శేఖర్, మహేష్‌ల భూములను కబ్జా చేశాడు. ఇందుకు అర్జున్, జంగయ్య, అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటేష్‌లను ప్రోత్సహించాడు. దీంతో బాలకృష్ణారెడ్డిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనకు సహకరించిన మిగతా వారి మీద ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది మార్చి 4న కొంగర మహేష్, కొంగర శేఖర్‌లు వేర్వేరుగా రాజాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేవలం మహేష్ కంప్లయింట్ ఆధారంగా బాలకృష్ణారెడ్డిని తప్పించే క్రమంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా, ఎలాంటి విచారణ జరపకుండా ఇతర చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 3 నెలల దాకా ఛార్జీషీట్ దాఖలు చేయలేదు. చివరికి బాలకృష్ణారెడ్డి, బంగారి వెంకటేష్‌ల పేర్లు తొలగించి ఛార్జీషీట్ నమోదు చేశారు. మరోవైపు అదే రోజు శేఖర్ కంప్లయింట్‌ను మాత్రం తీసుకోలేదు. 5 నెలలవుతున్నా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కబ్జాకు పురిగొల్పిన బాలకృష్ణారెడ్డి, బంగారి వెంకటేష్‌ల శేఖర్, మహేష్‌లను చంపుతామని బెదిరించడంతో అదే నెల 29న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా, నిందితుడైన బాలకృష్ణారెడ్డిని కాపాడేలా చార్జీషీటు నుంచి అతని పేరు తొలగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జూలై 7న కొంగర మహేష్ జాతీయ ఎస్సీ కమిషన్‌గా ఫిర్యాదు చేయగా 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ అయ్యాయి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని కొంగర శేఖర్ ఆగస్టు 3న ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఆగస్టు 19న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అట్రాసిటీ చట్టం ఏం చెబుతుంది?
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 సెక్షన్ 18ఏ(1)(ఏ) ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎలాంటి జాప్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాంతోపాటు డీఎస్పీ స్థాయికి తగ్గని అధికారి కేసును విచారించి 60 రోజుల్లోగా ఎస్సీ,ఎస్టీ స్పెషల్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేయాలి.
భూస్వామితో పోలీసులు కుమ్మక్కు: బాధితుల ఆరోపణ
అగ్రకుల భూస్వామి బాలకృష్ణారెడ్డితో పోలీసులు కుమ్మక్కు కావడం వల్లే అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం లేదని బాధితుడు కొంగర శేఖర్, మహేష్‌లు ఆరోపించారు. అంతేకాదు కంప్లయింట్ తీసుకోకుండానే పంచనామా పేరుతో ఎస్సై ప్రోద్భలంతో పోలీసులు లంచం తీసుకున్నారని, ఆ ఆధారాలను కూడా ఎస్సీ కమిషన్‌కు సమర్పించామని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని, బాలకృష్ణారెడ్డి.. అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.