SCR | వేసవి రద్దీ.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

  • Publish Date - April 11, 2024 / 10:18 AM IST

SCR | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా పలు మార్గాల్లోనూ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. బెంగాల్‌లోని షాలిమార్‌, సంత్రగాచి, కేరళలోని కొల్లానికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌ – సంత్రగాచి (07223) ప్రత్యేక రైలు ఈ నెల 19 నుంచి జూన్‌ 28 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనున్నది. సంత్రగాచి – సికింద్రాబాద్‌ (07224) రైలు ఈ నెల 20 నుంచి జూన్‌ 29 వరకు పరుగులు తీయనున్నది. రైలు రెండుమార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సికింద్రాబాద్‌ – షాలిమార్‌ (07225) రైలు ఈ నెల నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం నడువనున్నది. షాలిమార్‌ – సికింద్రాబాద్‌ (07226) మధ్య ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకూ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, సంత్రగాచి మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ – కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 18, 19, 26 రాకపోకలు సాగించనున్నది. కొల్లం – సికింద్రాబాద్ (07194) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో నడవనున్నది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల ఆగుతాయని వివరించింది.

Latest News