సంపన్న దళితులే క్రిమిలేయర్‌కు వ్యతిరేకం
విధాత, హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ముందుకొచ్చి అవసరమైన చట్టాలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలిసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్‌షా పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నవంబర్ 11న హైదారాబాద్ లో జరిగిన విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ మా ఉద్యమానికి మద్దతు పలికారన్నారు. సుప్రీం కోర్టులో సైతం కేంద్రం తమ వాదనను వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట్రాల సహకారం ఉందన్నారు.
మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి లకు ధన్యావాదాలు తెలిపానని తెలిపారు. రాష్ట్రాలు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు త్వరగా ముందుకు రావాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారని, సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని మంద కృష్ణ గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఈ నెల 13న హైదారాబాద్ కు బయలుదేరుతానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు.
విద్యా, ఉద్యోగాల్లో వెంటనే రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కోరుతామన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని.. రేవంత్ రెడ్డి శాసన సభలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారన్నారు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులను కలుస్తామన్నారు. నార్త్ లో కూడా పలు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం డిమాండ్లను ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులను కలుస్తామన్నారు. వర్గీకరణకు రాష్ట్రాలు వెంటనే ముందుకు రాకపోతే, సుప్రీం కోర్టును రాష్ట్రాలు ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను కేంద్రం ఆదేశించాలని ప్రధానిని కోరానని అన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని ప్రధాన మంత్రిని కోరానని తెలిపారు.
సంపన్న దళితులే క్రిమిలేయర్‌కు వ్యతిరేకం
పేదరికం నుంచి బయటపడిన వారికి రిజర్వేషన్ నుంచి మినహాయించాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆర్థికంగా పేద కుటుంబాల విద్యార్థులకు కటాఫ్ మార్కుల్లో మింహాయింపు కల్పించాలని తెలిపారు. పాశ్వాన్, ఖర్గే, మాయావతి దళితుల్లో ధనికులకే లీడర్లు అన్నారు. ఆర్థికంగా ఉన్నత వర్గంగా ఎదిగినవారే క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. క్రిమిలేయర్ వ్యతిరేకించేవారు పేదలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి సూచనైనా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దళితుల్లో కూడా సంపన్నులున్నారని తెలిపారు. క్రిమిలేయర్ ఎత్తేయడానికి వ్యతిరేకంగా 100 మంది ఎంపీలు ప్రధానిని కలిశారన్నారు. దళిత వర్గాల్లో పేదలకు న్యాయం జరగాలని దళిత వర్గాల ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు. దళిత వర్గాల్లో రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్న కొన్ని కుటుంబాలు పార్లమెంటులో తిష్ట వేశారన్నారు. పెద్దపల్లిలో వివేక్ వెంకట స్వామి కుటుంబం తిష్ట వేసిందన్నారు.
మల్లు రవి, భట్టి విక్రమార్క రాష్ట్రంలో రాజకీయంగా తిష్ట వేశారని తెలిపారు. బీహార్ లో రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం తిష్ఠ వేసిందన్నారు. మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని.. పేద వ్యక్తి అని చెప్పాలా? అని తెలిపారు. మాయావతి క్రిమిలేయర్ కు వ్యతిరేకమని తెలిపారు. మల్లికార్జున ఖర్గే కుటుంబం రాజకీయాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందుతుందన్నారు. పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా క్రిమిలేయర్‌ను అడ్డుకుంటున్నారన్నారు. క్రిమిలేయర్ వద్దనే వారు ప్రత్యామ్నాయ సూచనలు కూడా చేయడం లేదన్నారు. 2024 సుప్రీంకోర్టు తీర్పు మోదీ తీర్పు అయితే 2004లో ఇచ్చిన తీర్పు సోనియాగాంధీ, మన్మోహన్ తీర్పునా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టును తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును ప్రశ్నిస్తూ మళ్లీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.. దాన్ని ఎవరు ఆపలేరన్నారు. దళితుల్లో కూడా సాంఘిక సమానత్వం లేదన్నారు. తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.