– అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించిన జూడాలు
– ధర్నాలో పాల్గొన్న నర్సింగ్ సిబ్బంది, వైద్యాగ్ విద్యార్థులు
విధాత, వరంగల్ ప్రతినిధి:పశ్చిమ బెంగాల్లో పీజీ వైద్య విద్యార్థిని పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సిబీఐ విచారణ జరిపి ఈ ఘటనలో భాగమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ డాక్టర్ల రక్షణకు కేంద్ర రక్షణ చట్టం (సి పి ఎ) అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఐ ఎం ఎ వరంగల్ నుండి డాక్టర్ అన్వర్ మియా, డాక్టర్ శ్రావణ్, టి జి యం సి సభ్యులు డాక్టర్ వేములపల్లి నరేష్ మద్దతు తెలిపారు.
– ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లకు వసతుల కరువు
ఎంజీఎం హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లకు వసతుల కరువయ్యాయి. డ్యూటీ రూమ్‌లు లేక తరచు జూడాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డ్రెస్సింగ్ రూములు కూడా అందుబాటులో లేవన్నారు. వాష్ రూమ్స్ అసలే లేవనీ, కనీసం త్రాగు నీరు కూడ లేని పరిస్థితిలో జూనియర్ డాక్టర్లు పని చేస్తున్నారని వివరించారు. ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందని జూడాలు వాపోయారు. అనంతరం సూపరింటెండెంట్ డా. మురళిని కలిసి సమస్యలను పరిష్కరించాలని లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు.