న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. ప్రభాకర్ రావుకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ కొనసాగింది. విచారణకు ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్ చేయాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం నవంబర్ 18కి వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ ఎఎల్) నివేదికను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. ప్రభాకర్ రావు ఈ కేసులో కోర్టుకు హామీ ఇచ్చిన విధంగా విచారణకు సహకరించడం లేదని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్ద లూథ్రా వాదించారు. అమెరికాలో ఉన్న సమయంలో ప్రభాకర్ రావు తన నివాసంలోని ల్యాప్‌టాప్‌లోని ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో దీనికి సంబంధించిన స్పష్టమైన వివరాలు, తేదీలతో పాటు మొత్తం డేటాను రీసెట్ చేసి ఆధారాలన్నీ చెరిపేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ తొలగించే ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏపీసీ రాధాకిషన్ రావు, డీసీసీలు భుజంగరాలు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్ రావు, టీవీ చానెల్ నిర్వాహకుడు ఎల్. శ్రవణ్ రావులు ఈకేసులో నిందితులుగా ఉన్నారు.