Srushti Fertility | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసు కీలక మలుపు తిరిగింది. సెంటర్ నిర్వాహకురాలు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించారు. అంతేకాకుండా ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని కూడా బయటపడింది. ఇన్నేళ్లుగా నకిలీ పేరుతో సెంటర్‌ను నడుపుతూ వందలాది దంపతులను మోసం చేసినట్టు తేలింది. ఇన్నాళ్లూ తనకేం తెలియదని, సోనియా, గోవింద్ సింగ్‌లు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించిన నమ్రత అసలు గుట్టు బయటపెట్టుకుంది.
అద్దె గర్భం పేరిట సంతానం కలగని దంపతుల వద్ద నుండి ఒక్కో కేసులో రూ.30 లక్షల నుండి రూ.40 లక్షల వరకు తీసుకున్నట్టు విచారణలో బయటపడింది. గర్భిణీలను ప్రలోభపెట్టి ప్రసవం అనంతరం వారి నుంచి శిశువులను కొనుగోలు చేసి ఇతర దంపతులకు ఇచ్చినట్టు వెల్లడైంది.
విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో తన 1988 బ్యాచ్స్నేహితులతో కలిసి ఈవ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిసింది. 2007లో సికింద్రాబాద్‌లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించి, తరువాత అనేక శాఖలుగా విస్తరించి అక్రమాలను యధేచ్చగా కొనసాగించారు. డబ్బు ఆశ చూపించి, అబార్షన్‌కు సిద్ధమైన మహిళలను ప్రసవించేలా చేసి ఆ శిశువులను కూడా కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలోసంజయ్, సంతోషి అనే వ్యక్తులు ప్రముఖ పాత్ర పోషించారని నమ్రతతెలిపారు. ఆమె కుమారుడు కూడా న్యాయ సంబంధిత విషయాల్లో సహకరించినట్టు చెప్పారు. ఇలాగే రాజస్థాన్ దంపతులను మోసం చేస్తే, డీఎన్ఏ టెస్టుల ద్వారావాస్తవం బయటకొచ్చింది.
ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేశారు. ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత అలియాస్ అట్లూరి నీరజపై 15కి పైగా కేసులు నమోదయ్యాయి. సాక్ష్యాలు, డీఎన్ఏ రిపోర్టులు, బాధితుల వాంగ్మూలాలతో ఈ కేసు మరింత బలపడింది.