నేటీ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో అనుసరించే వ్యూహంపై చర్చ
మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసానికి నిర్ణయం
గైర్హాజరైన ఆరుగురు ఎమ్మెల్యేలు…12మంది కార్పోరేటర్లు
కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారన్న సందేహాలు
విధాత, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధి లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ లతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. శనివారం జరగనున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష చేశారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మిపైన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డిలపై అవిశ్వాసం ప్రతిపాదనకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతి అంశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. రేపటి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని బీఆరెస్ అధిష్ఠానం ఆదేశించింది. కేటీఆర్ ఈ సమావేశానికి అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో తలసాని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి 47మంది కార్పోరేటర్లకుగాను 35మంది హాజరయ్యారు.
ఈ సమావేశంలో మాజీమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ , సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ లు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి ఆరుగురు అరికపూడి గాంధీ,వివేకానందగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావులు గైర్హాజరయ్యారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నందునే వారు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారన్న వాదన వినిపిస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకా, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. 12మంది కార్పోరేటర్లు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఎందుకు గైర్హాజరయ్యారన్నదానిపై బీఆరెస్‌లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 53మంది బీఆరెస్ కార్పోరేటర్ల బలం ఇప్పటికే 47కు పడిపోగా, వారిలో ఎంతమంది అవిశ్వాసానికి మద్దతునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.