Teacher transfers | ప్రారంభమైన టీచర్ల బదిలీలు.. పదోన్నతులు

రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ శనివారం నుంచి ప్రారంభించింది. మల్టీజోన్ - 1లో శనివారం నుంచి 22వరకు, మల్టీజోన్‌-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు

  • Publish Date - June 8, 2024 / 04:43 PM IST

12,472మందికి బదిలీలు..18,495మందికి పదోన్నతులు

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ శనివారం నుంచి ప్రారంభించింది. మల్టీజోన్ – 1లో శనివారం నుంచి 22వరకు, మల్టీజోన్‌-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. మల్టీజోన్‌-2లో హెచ్‌ఎం పదోన్నతి, మల్టీజోన్‌-1లో స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంతో ప్రక్రియ మొదలుపెట్టారు. మల్టీజోన్‌-1లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లోనూ, మల్టీజోన్‌-2లో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోనూ పదోన్నతులు కల్పిస్తారు. ఇలా 1,250 మందికి పదోన్నతులు లభిస్తాయి.

కోర్టు కేసుల కారణంగా గతంలో ఎక్కడ ఈ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడినుంచి పునఃప్రారంభిస్తారు. ఉపాధ్యాయులకు టెట్‌తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పిస్తారు. మూడేండ్లలోగా పదవీ విరమణ పొందనున్నవారిని తప్పనిసరి బదిలీ నుంచి మినహాయించారు. ఈ సారి 12,472 మంది టీచర్లు బదిలీకానుండగా, మరో 18,495 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉన్నది. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్‌పడింది. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రమంతటా బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు సర్కారు అనుమతిచ్చింది.

23రోజల్లో బదిలీలు.. పదోన్నతుల ప్రకియ పూర్తి

ఉపాధ్యాయ బదిలీలు..పదోన్నతుల ప్రకియ మొత్తంగా 23 రోజుల్లో పూర్తికానున్నది. 8,630 మంది గ్రేడ్‌-2 భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజెస్‌)గా పదోన్నతి కల్పిస్తారు. మరో 1,849 మంది ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఇంటర్మీడియట్‌, డీఎడ్‌ పూర్తిచేసిన వారికి ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పదోన్నతి కల్పిస్తారు. 2023లో బదిలీ ఉత్తర్వులు అందుకున్నవారిని రిలీవ్‌ చేయలేదు. వారికి అదే స్థానంలో కొనసాగాలని అప్పట్లో ఆదేశించారు.

తాజాగా పాత స్థానంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసిన ప్రదేశాలకు రిలీవ్‌చేస్తూ ఉత్తర్వులిచ్చారు. బదిలీలు, పదన్నోతుల ప్రకియలో గ్రేడ్ -2లో హెచ్‌ఎం(గెజిటెడ్‌) 1788మందికి బదిలీ, 763మంది పదోన్నతి కల్పిస్తారు. స్కూల్ అసిస్టెంట్‌లలో 10,684మందికి బదిలీ, 5,123మందికి పదోన్నతి, పీఎస్‌హెచ్‌ఎంలకు 2,130మందికి బదిలీ, భాషా పండితులు, పీఈటీలు 10,479మంది బదిలీలు కల్పిస్తారు. మొత్తం 12,472మందికి బదిలీ, 18,495మందికి పదోన్నతులు కల్పించనున్నారు.

Latest News