Site icon vidhaatha

TS 10th results | నేడే తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

TS 10th results : ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు (TS 10th results) ఇవాళ (మంగళవారం) విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల (TS 10th Exams) ను ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రాసిన 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 2న పరీక్షలు పూర్తికాగా.. ఆ వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. ఏప్రిల్ 13 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.

మెమోలపై PEN నంబర్‌లు..

తెలంగాణలో తొలిసారిగా పదో తరగతి మెమోలపై పెన్ (Permanent Education Number) నెంబర్‌ను ముద్రించనున్నారు. విద్యాశాఖ ఓటీఆర్ తరహాలో విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN) ను అమలు చేయనుంది. ఆ మేరకు పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ప్రింట్‌ చేయించనుంది. ఈ పెన్ నెంబర్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడి ఉంటుంది. పెన్ నెంబర్ ఆధారంగా నకిలీ సర్టిఫికెట్‌లను సులువుగా గుర్తించే వీలు కలుగుతుంది.

Exit mobile version