- వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలుజారీ
- ప్రజలు అనవసరంగా బయటికిరావద్దని సూచన
Heavy Rains | తెలంగాణ రాష్ట్రం మళ్లీ మేఘాలతో ముంచెత్తుతోంది. ఇప్పటికే వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ తాజాగా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ఆగస్టు 8 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు-పశ్చిమ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆగస్టు 5 తర్వాత భారీ వర్షాలు రాష్ట్రం మొత్తాన్ని కవరుచేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూన్ నెలలో సాధారణంగా ఉండే 131.4 మిల్లీమీటర్లకు బదులుగా కేవలం 99 మిల్లీమీటర్లు మాత్రమే నమోదవగా, జులైలో మాత్రం సాధారణ స్థాయిని మించి 229.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా సరే మొత్తం రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 4 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ లోటు మరింత ఎక్కువగా ఉంది. అయితే రానున్న భారీ వర్షాలు ఈ లోటును కొంత మేర భర్తీ చేయగలవని వాతావరణశాఖ భావిస్తోంది.
ఇక సోమవారం హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షం జనజీవనాన్ని పూర్తిగా ముంచెత్తింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సికింద్రాబాద్, కోఠి, బంజారాహిల్స్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడా, మైత్రీవనం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్‌లో 7.4 సెం.మీ, మెహిదీపట్నంలో 5.3 సెం.మీ, బంజారాహిల్స్‌లో 4.6 సెం.మీ వరకు వర్షం కురిసింది. రోడ్లు చెరువులను తలపించగా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆసుపత్రి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు గంటసేపు సమయం పడుతోంది. వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
వర్షం నేపథ్యంలో హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలీపురం, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, నాంపల్లి, అబిడ్స్, మలక్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సచివాలయం, రాజ్‌భవన్ రోడ్ వద్ద వర్షపు నీరు రోడ్డుపైనకి చేరడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అవసరమైతే తప్ప బయటకు రానొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి.
వాతావరణ పరిస్థితులను గమనించినవారికి స్పష్టంగా తెలుస్తోంది – ఈ వర్షాలు సాధారణ మోస్తరు జల్లులు కాదు. భవిష్యత్తు వర్షపాతం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హితవు పలికారు.