Telangana High Court : ఓటు చోరీ పిటిషన్ పై ఈసీకి ఆదేశాలివ్వలేం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు చోరీపై బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, మాగంటి సునీతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. ఓటర్ల పరిశీలన కొనసాగుతున్నందున తాము ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana High Court

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరీపై బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, మాగంటి సునీతలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తాము ఈసీకి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ తరపున న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, ఈసీ తరపున న్యాయవాది అవినాశ్ వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ లో 19 వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని, 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని శేషాద్రినాయుడు వాదించారు. కొంత మందికి రెండు ఓట్లు ఉన్నాయని, ఒకే ఇంట్లో 43ఓట్లు ఉన్నాయని తెలిపారు. పిటీషనర్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేశారని వివరించారు.

అయితే ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని ఈసీ న్యాయవాది అవినాశ్ వివరించారు. 21వ తేదీ వరకు పరిశీలన కొనసాగుతుందన్నారు. పిటిషనర్ల ఆరోపణలపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆయన నుంచి వివరణ అడిగామని..నివేదిక ఇంక అందలేదని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటీషన్ లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణను ముగించింది.