Telangana Local Body Elections 2025 Schedule Released – Key Dates and Details
విధాత, హైదరాబాద్:
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Telangana Local Body Elections 2025) నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల కానుంది. ఆ రోజే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 27న జరుగుతాయి. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పోలింగ్ రోజునే ప్రకటిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న జరగనుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు – గ్రామ పంచాయతీ ఎన్నికలు – ముఖ్య తేదీలు
- తొలి విడత:
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 12
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 15
- పోలింగ్ తేదీ: అక్టోబర్ 23
- ఓట్ల లెక్కింపు: నవంబర్ 11
- రెండో విడత:
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 16
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 19
- పోలింగ్ తేదీ: అక్టోబర్ 27
- ఓట్ల లెక్కింపు: నవంబర్ 11
గ్రామ పంచాయతీ ఎన్నికలు
- తొలి విడత:
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 20
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 23
- పోలింగ్ తేదీ మరియు ఫలితాలు: అక్టోబర్ 31
- రెండో విడత:
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 21
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 23
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 27
- పోలింగ్ తేదీ మరియు ఫలితాలు: నవంబర్ 4
- మూడో విడత:
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 25
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 27
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 28
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 31
- పోలింగ్ తేదీ మరియు ఫలితాలు: నవంబర్ 8
ఎన్నికల వివరాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ స్థానాలు, 656 జడ్పీటీసీ స్థానాలు, 12,733 గ్రామ పంచాయతీలు, మరియు 1,12,288 వార్డులకు ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు. మొత్తం 81,61,984 మంది ఓటర్లు ఉన్నారని, ఈ ఎన్నికల కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, మరియు జడ్పీటీసీ వారీగా ప్రచురించినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని కూడా పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు నిలిపివేతలు
హైకోర్టు ఆదేశాల ప్రకారం కొన్ని చోట్ల ఎన్నికలు జరగవు.
- 14 ఎంపీటీసీలు,
- 27 గ్రామ పంచాయతీలు,
- 246 వార్డులకు ఎన్నికలు వాయిదా.
ములుగు జిల్లాలో 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగదు.
ఎన్నికల కోడ్ అమల్లోకి
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు, వాగ్దానాలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. రాజకీయ పార్టీలు ఇప్పటికే బరిలోకి దిగి వ్యూహాలు రచించుకుంటున్నాయి. గ్రామీణ రాజకీయాలకు ఇవి కీలకమైన ఎన్నికలుగా నిలవనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఖాళీల వివరాలు అందినట్లు రాణి కుముదిని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి, ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు సన్నాహాలు పూర్తి చేశారని ఆమె స్పష్టం చేశారు.