Site icon vidhaatha

Sridhar Babu | నిరుద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌డం సాధ్యం కాదు : మంత్రి శ్రీధ‌ర్ బాబు

Sridhar Babu | హైద‌రాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌డం స‌రికాదు అని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు రంగంలో వీలైనంత వ‌ర‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ బాబు మాట్లాడారు.

రాష్ట్రంలోని చ‌దువుకున్న యువ‌త‌ను దృష్టిలో ఉంచుకుని పాజిటివ్ దృక్ప‌థంతో ముందుకు న‌డ‌వాలని నిర్ణ‌యించాం. ఈ రాష్ట్ర యువ‌త‌కు సంబంధించి ప్ర‌భుత్వ ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఏర్పాటు త‌ర్వాత ఉద్యోగ ఖాళీల‌ను నింప‌డానికి టీజీపీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేశాం. జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టిస్తాం. ప్ర‌భుత్వ ఖాళీలు భ‌ర్తీ చేస్తామ‌ని శ్రీధ‌ర్ బాబు ప్ర‌క‌టించారు.

భ‌విష్య‌త్‌లో నిరుద్యోగ యువ‌త ఆశయాల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాం. రాబోయే కాలంలో మా ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 20 ల‌క్ష‌ల పైచిలుకు నిరుద్యోగ యువ‌త ఉపాధి కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు అంద‌రికీ ఇవ్వ‌డం సాధ్యంకాదు. రాబోయే 30 ఏండ్ల వ‌ర‌కు యువ‌త నిరాశ‌లో ఉండొద్ద‌నే ఉద్దేశంతో ప్ర‌య‌వేటు రంగంలో ఉపాధి క‌ల్ప‌న చేయాల‌ని నిర్ణ‌యించాం. ఆ బాధ్య‌త‌లో భాగంగానే మా ప్ర‌భుత్వం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు నిర్ణ‌యించామ‌ని శ్రీధ‌ర్ బాబు తెలిపారు.

రాష్ట్రానికి అనేక ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. కానీ ఆ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేయడానికి కావాల్సిన నైపుణ్యం యువ‌త లేకుండా పోతోంది. దీంతో ఆ నైపుణ్యానికి సంబంధించి గ్రాడ్యుయేట్ల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. స్కిల్ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు గ‌త ఆరు నెల‌ల నుంచి 20 సార్లు పారిశ్రామిక వేత్త‌లు, వీసీలు, విద్యార్థుల‌తో అనేక అభిప్రాయాల‌ను తీసుకున్నాం. ఈ క్ర‌మంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీని ప్ర‌తిపాదిస్తున్నాం. నైపుణ్యాల కోసం ఈ ప్ర‌త్యేక యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో రాష్ట్ర యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు ఆర్థిక వృద్ధిపెరుగుతుంది. అంతేకాకుండా ప‌రిశ్ర‌మ‌లు కూడా భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని శ్రీధ‌ర్ బాబు తెలిపారు.

Exit mobile version