పాలన గాలికి,పగ ప్రతీకారంపైనే దృష్టి … కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేసి.. ప్రతిపక్షాల మీద ప్ర‌తీకారం, ప‌గ మీద దృష్టి పెట్టిందని, అక్రమ కేసులు నమోదు చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమర్శించారు

  • Publish Date - July 3, 2024 / 04:01 PM IST

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేసి.. ప్రతిపక్షాల మీద ప్ర‌తీకారం, ప‌గ మీద దృష్టి పెట్టిందని, అక్రమ కేసులు నమోదు చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీఆరెస్‌ పార్టీకి చెందిన పదవి కాలం పూర్తయిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌కు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌న్మాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌ ఏడు నెల‌ల పాలనలో ప‌ల్లెలు మురికి కూపాలుగా మారాయని, ఒక్క రూపాయి కూడా గ్రామ‌పంచాయ‌తీల‌కు ఇవ్వ‌లేదని, ఏడు నెల‌ల నుంచి పారిశుద్ధ్య కార్మికుల‌కు జీతాలు లేవన్నారు. నిధులు లేక‌ గ్రామ‌పంచాయ‌తీలు ఆగ‌మాగం అవుతున్నాయని, స్కూళ్ల‌ల్లో మిడ్ డే మీల్స్ కార్మికులకు జీతాలు లేవని, క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేద‌ని ఓ స్కూల్‌కు క‌రెంట్ బంద్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షతో రోజులు వెళ్లదీస్తుండటంతో ఎక్క‌డా చూసిన ఆత్మ‌హ‌త్య‌లు, హ‌త్య‌లు, మాన‌భంగాలు జ‌రుగుతున్నాయని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

రైతుబంధు అమలులో విఫలం

కాంగ్రెస్ పాలకులు జూలై వ‌చ్చినా ఒక్క రూపాయి రైతుబంధు ఇవ్వ‌కుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా రెండు దఫాలు రైతుబంధు చెల్లింపులో విఫలమైందన్నారు. . గ‌త బీఆరెస్‌ ప్ర‌భుత్వంలో జూన్ నెల‌లోనే రైతుబంధు ఇచ్చేవాళ్లమని,. ఇప్ప‌టికి చాలా చోట్ల వ‌రి నాట్లు ప‌డ‌లేదని, కేవ‌లం మూడు శాతం మాత్ర‌మే వ‌రి నాట్లు ప‌డ్డాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.
ఖ‌మ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సీఎం సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో మ‌రో రైతు పురుగుల‌ మందు తాగేందుకు య‌త్నించాడని గుర్తు చేశారు.

మ‌ళ్లీ కేసీఆర్ వస్తారు..

తెలంగాణ ప్ర‌జ‌లు అన్నీ కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యాలను గమనిస్తున్నారని, మళ్లీ ఎన్నిక‌లు రాక త‌ప్ప‌దు.. మ‌ళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకుంటారని, అంద‌రూ ధైర్యంగా ఉండాలని, మ‌న‌కు మంచి రోజులు వ‌స్తాయని హరీశ్‌రావు భరోసానిచ్చారు. బీఆరెస్ ప్ర‌భుత్వంత‌ప్ప‌కుండా వ‌స్త‌దని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్ర‌జా జీవితంలో ప‌ద‌వికి విర‌మ‌ణ ఉంటుందేగాని ప్ర‌జాసేవ‌కు విర‌మ‌ణ ఉండ‌దని, నాయ‌కుడు అనే వాడు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని ఆయ‌న పదవి కాలం ముగిసిన స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. రేప‌ట్నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకుండా, మండ‌లాలు, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాల‌ని హ‌రీశ్‌రావు కోరారు.

Latest News