కరెంటుపై మాటల యుద్ధం.. ఓవైపు నిరసనలు.. మరోవైపు సవాళ్లు

  • Publish Date - October 12, 2023 / 08:22 AM IST

  • 24 గంటల విద్యుత్ పై రైతుల పట్టు
  • విద్యుత్ వైర్లు పట్టుకుంటానంటూ కోమటిరెడ్డి సవాల్
  • కరెంటు చుట్టూ తిరుగుతున్న నల్గొండ రాజకీయం


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా కరెంటు రాజకీయాలు ముట్టుకోకుండానే షాక్ కొడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా 24 గంటల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, దీనిపై అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే కరెంటు తీగలు పట్టుకోవాలని సవాల్ చేశారు.


గతంలో ఎన్నడూ లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందిస్తోందని చెప్పుకొచ్చారు. దీనిపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదని, కేవలం రెండు, మూడు గంటల కరెంటు సరఫరా చేసి.. 24 గంటలు అని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసే కుట్రలు తిప్పికొడతామన్నారు.


అవసరమైతే తెలంగాణ ప్రజల కోసం కరెంటు తీగలను పట్టుకోడానికి తాను సిద్ధం అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. దమ్ముంటే లాగ్ బుక్కులు తెచ్చి 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని ఆయన బీఅరెస్ కు సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తూ, గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును ప్రతి సభలు, సమావేశాల్లో ప్రజలకు వివరిస్తూ వచ్చారు. కోమటిరెడ్డి దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తున్నారు.


రోడ్డెక్కుతున్న రైతులు


రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధం చేస్తుంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా జరగడం లేదంటూ రోడ్లపైకి వస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్ నగర్, కోదాడ, భువనగిరి, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గా ల్లో రైతులు, ప్రజా సంఘాల నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కేవలం రాజకీయ నేతలు రాజకీయ స్వలాభం కోసం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో 50 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కరెంటు పంచాయితీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో వేచి చూడాలి.

Latest News