Site icon vidhaatha

DANAM NAGENDER | నన్ను రెచ్చగొట్టారు..అందుకే అలా మాట్లాడాను దానం నాగేందర్

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో తనను కావాలని బీఆరెస్‌ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి రెచ్చగొట్టారని, అందుకే వారిపై అసెంబ్లీలో పరుషంగా మాట్లాడాల్సివచ్చిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు… బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్‌లో రికార్డు కాలేదని పేర్కొన్నారు. సీఎంను, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి తాను అలా మాట్లాడాల్సివచ్చిందన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వాడుక భాషలోనివేనని, అవి ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెబుతున్నానన్నారు. అధికారం కోల్పోవడం వల్ల బీఆరెస్‌ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వారు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని, గత పదేళ్లుగా ఏనాడూ నా లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదని, బీఆరెస్‌ ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించి తమ పద్ధతిని మార్చుకోవాలని దానం నాగేందర్ హితవు పలికారు.

Exit mobile version