Site icon vidhaatha

TELANGANA ASSEMBLY | ఇది కౌరవ సభ,అంతిమంగా పాండవులదే విజయం… ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు స్వాగతిసున్నాం సభలో హరీశ్‌రావు

విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చిందని, అంతిమంగా పాండవులదే విజయమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శంచారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బీఆరెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మాకు మైక్ ఇవ్వకుండా, వారు క్షమాపణలు చెప్పకుండా సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారని విమర్శించారు. మాకు మైక్ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. స్పీకర్ ముందుగా స్కిల్ యూనివర్సిటీ, ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై మాట్లాడాలని చెప్పడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆరెస్‌ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. వర్గీకరణపై తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభా నాయకుడిగా కేసీఆర్‌ నవంబర్‌ 29, 2014లో వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. కేంద్రానికి ఏకగ్రీవంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేసిన పార్టీ బీఆరెస్‌ అని.. తీర్మానం చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్‌ తీసుకొని వెళ్లి ఆ నాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి ప్రధానిని కలిసి అందజేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్‌ వివరించారని.. ప్రధాని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్‌ అనీ, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ఆ రోజు సానుకూలంగా స్పందించారన్నారు.

అయితే, వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందని.. ఎన్నో త్యాగాలు జరిగాయన్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన సంగతి మనకు తెలుసునన్నారు. ఇదే గాంధీ భవన్‌ దగ్గర పెట్రోల్‌ పోసుకొని ఆ రోజు కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. కానీ, ఆ మాదిగలకు కేసీఆర్‌.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆరెస్ అని, మా నాయకుడు కేసీఆర్‌ అని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని.. వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని గాంధీ భవన్‌ వద్ద పెద్ద ఎత్తున మాదిగలు ముట్టడికి వచ్చి పోరాటం చేసేందుకు వచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్‌ ప్రభుత్వం ఆదుకున్నదన్నారు. మాదిగల దశబ్దాలా కల నెరవేరినటువంటి రోజని.. బీఆరెస్‌ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్‌ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు బీఆరెస్‌ తరఫున సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామన్నారు. అయితే నిన్న ఇవాళ సభ జరిగిన తీరు మా హృదయాలను గాయపరిచిందన్నారు. మహిళా శాసనసభ్యులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై సీఎం, డిప్యూటీ సీఎంలు క్షమాణపలు చెప్పాలని, మా సభ్యులకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Exit mobile version