Jagga Reddy : గెలుపు, ఓటములు నన్ను ప్రభావితం చేయలేవు

'గెలుపు, ఓటములు నన్ను ప్రభావితం చేయలేవు' అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేటలోని కందకం రోడ్డు పనులను సమీక్షించిన ఆయన, 11 ఏళ్లయినా పనులు పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్ పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టారు.

Jagga Reddy

విధాత : గెలుపు, ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు అని..నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. రాత్రుళ్ళు జెండాలు కట్టి.. పగటి పూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది అని, కులం పేరు చెప్పుకొని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చాను అని స్పష్టం చేశారు. మళ్ళీ రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల, జగ్గారెడ్డిలు సమీక్ష నిర్వహించారు. సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డుకు నేను ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డిల సహకారంతో స్పెషల్ జీఓ తెచ్చి 2014 జనవరిలో రూ.20 కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. రోడ్డు పొడవు 2.5 కిలో మీటర్లు, కల్వర్టులతో సహా దాదాపు పని పూర్తయిందన్నారు. ఈశ్వర మంధిర్ దగ్గర ఏడు ఇళ్ళ తొలగింపు లో సమస్య ఉందని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు అని తెలిపారు. దానికి బదులుగా ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారన్నారు. 2014లో నిధులు మంజురైన కందకం రోడ్డు పనులను 11ఏళ్ల పాటు ఎందుకు పూర్తి చేయలేక పోయారని అధికారులను ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 కోట్లు మంజూరైతే..11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారని..పనులు ఇప్పటికీ పూర్తి చేయలేక పోయారని..ఇంకా 5 కోట్లు పనులు మిగిలి ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

11ఏళ్లుగా సాగుతున్న రోడ్డు పనులు..పట్టించుకోని బీఆర్ఎస్ పాలకులు

2014లో ఎమ్మెల్యేగా నేను మంజూరు చేయించిన రోడ్డు పనులను 11 ఏళ్ల తర్వాత మళ్లీ నేనే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివ పేట ప్రజలు ఆలోచించాలని జగ్గారెడ్డి కోరారు. ఇన్నేళ్లు ఏం చేశారని అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ లు సుభాష్, విశ్వనాథ్ లను జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరకు వెళ్ళి ఎన్నో సార్లు అడిగామని, ఆ కుంపటి మనకెందుకు అని , వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబిచ్చిన వారు జగ్గారెడ్డికి వివరించారు. మంత్రి హరీష్ రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయం తీసుకెళ్లామని , నిర్వాసితుల సమస్య తీర్చమని అడిగామని సుభాష్, విశ్వనాథ్ లు వెల్లడించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంలు తప్పా వేరే ఏ పరిహారం ఇచ్చేదిలేదని హరీష్ రావు చెప్పాడని , కందకం రోడ్డు సమస్యను ఇటు చింతా ప్రభాకర్, అటు హరీష్ రావు పట్టించుకోలేదని వారు వివరించారు.