రైతు గోడుపై గొంతెత్తిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు!

ధాన్యం కొనుగోలు సమస్యలపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేసిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజా ప్రభుత్వం ముసుగు క్రమంగా తొలగిపోతుంది. హక్కుల కోసం..సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న గొంతులపై అణిచివేత అస్త్రం ప్రయోగిస్తుంది. ఇందుకు నిదర్శనంగా.. ముందు వడ్లు కొనండి అని కామెంట్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్‌పై పాలక వర్గం వేటు వేసింది. ఇప్పుడి వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ప్రభుత్వం తీరుపైన నెటిజన్లు మండిపడుతున్నారు.

అసలు ఏం జరిగిందీ..?

పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో బస్‌స్టాండ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు. బస్సు డ్రైవర్‌ అశోక్ ధర్నాను గమనిస్తూ.. ముందు ధాన్యం, మక్కలు కొనండి..తర్వాత పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అశోక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రభుత్వం అసహనానికి గురైంది.

డ్రైవర్ ఆశోక్ పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. తనను విధుల్లోకి రావొద్దని రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపినట్లు అశోక్ వెల్లడించారు. ఆర్డీసీ డ్రైవర్ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యపై జనాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వినిపిస్తుంది. అశోక్ కు తప్పు ఏం మాట్లాడలేదని..క్షేత్ర స్థాయిలో ధాన్యం, మక్కల కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ కార్మికుడి మనసుతో స్పందించారంటూ తమ మద్దతు తెలుపుతున్నారు.

నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు: డ్రైవర్ అశోక్ వివరణ

నిన్న కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్నా చేస్తున్న సమయంలో మా ఊరి వ్యక్తితో నేను మాట్లాడానని, అక్కడ మా ఊరి వ్యక్తి ఉండగా, డీజిల్, పెట్రోల్ గురించి కాదు.. ముందు వడ్లు, మొక్కజొన్నలు కొనండి అని అతనితో చెప్పానని వివరించారు. నేను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదు.. రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు. దీనికి నన్ను డ్యూటీకి రావద్దని ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, ఐదు డిపోలకు నాకు డ్యూటీ వేయొద్దని లెటర్ పంపినట్లుగా అశోక్ వెల్లడించారు.

విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీస్ ముట్టడి : మాజీ మంత్రి గంగుల 

‘ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ని విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీస్‌ని ముట్టడిస్తాం అని మాజీ మంత్రి గంగుల కమలాకర్  హెచ్చరించారు.

డ్రైవర్ అశోక్ తొలగింపు వార్తలు అవాస్తవం : మంత్రి పొన్నం

జగిత్యాలలో రైతుల పక్షాన మాట్లాడిన డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుండి తొలగించారనే వార్తలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. అశోక్ ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అని, ఆర్టీసీ ఉద్యోగి కాదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ అతన్ని విధుల్లోంచి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించామన్నారు. ఆశోక్ వ్యాఖ్యలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, ధాన్యం కొనుగోలుపై అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

 

ఇవి కూడా చదవండి :

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లే.. నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ప్రమాదం!
ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్

Latest News