విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఇక మీదట తెలంగాణలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట సవరణకు గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో న్యాయశాఖ మంగళవారం గెజిట్ పబ్లికేషన్ విడుదల చేసింది. ఇక మీదట స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అడ్డుగా ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది కూడా పోటీ చేసే వెసులు బాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
జనాభా సమతుల్యత సాధనలో ముందడుగు
ఇద్దరు పిల్లల పరిమితి నిబంధన ఎత్తివేతతో కేవలం స్ధానిక ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో మాత్రమే ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా..రాష్ట్రంలో, దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు, జనాభా పెరుగుదల రేటును పెంచడానికి, జనాభా సమతుల్యతకు కూడా దోహదం చేయనుండటం గమనార్హం. ఇప్పటికే ఇద్దరు పిల్లల పరిమితి నిబంధనను చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తాజాగా ఏపీ, తెలంగాణలు కూడా ఎత్తివేయడం విశేషం. వృద్ధుల జనాభాపెరిగిపోతున్న క్రమంలో దేశంలో జనాభా సమతుల్యతకు సంతానోత్పత్తి రేటు 2.1తగ్గకుండా ఉండాల్సి ఉంది. అయితే కుటుంబ నియంత్రణ అమలు నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు 1.6కు పడిపోవడం ఆందోళనకరంగా మారింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ ప్రభుత్వం కూడా, జనాభా సమతుల్యత సాధనకు సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఒక్కో రాష్ట్రం ఇద్దరు పిల్లల నిబంధనలను ఉపసంహరించుకుంటున్నాయి
