బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం , గనుల వేలం ప్రారంభోత్సవంలో : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని, వేలం పాటల వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుందని కేంద్రానికి కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కోన్నారు.

  • Publish Date - June 21, 2024 / 04:09 PM IST

విధాత, హైదరాబాద్‌ : బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని, వేలం పాటల వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుందని కేంద్రానికి కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కోన్నారు. హైదరాబాద్‌లోని వెస్ట్‌ ఇన్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారంగా ఉందని.. బొగ్గు లేనిదే విద్యుత్తు ఉత్పత్తి సాధ్యం కాదని.. తెలంగాణ ప్రాంతంలో లభించే బొగ్గుకు డిమాండ్ ఉందని.. ఇది కోల్ కాదు.. బ్లాక్ గోల్డ్ అని కొనియాడారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి బొగ్గు బ్లాకులకు ఈ వేలం వేస్తున్నామని.. మార్కెట్ లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు. అలాగే ఒక్కప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వేత్తలు విద్యుత్తు కోసం ఆందోళన చేసేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. వ్యవసాయం, కమర్షియల్, గృహ అవసరాలకు తగినంత రాష్ట్రంలో అందుబాటులో ఉందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని..

ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం లేదన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందని, సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పాారు. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తామని సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందని, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆరెస్‌ నేతలు, బీఆరెస్‌ బీజేపీలు ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరుతున్నానని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం వేలంలో పాల్గొని గనులు సాధించాల్సింది: భట్టి విక్రమార్క

తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని, అదే సమయంలో రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం పాటలో ఉండటం బాధాకరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేలం నిర్ణయంతో సింగరేణి ఈ ప్రాంతంలో తన హక్కులు కోల్పోయిందన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసని, సింగరేణికి కొత్త గనులు కేటాయించాల్సిందిపోయి తెలంగాణలోని 4 గనుల బ్లాకులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల 2 సార్లు వేలంలో సింగరేణి పాల్గొనలేదన్నారు. కేంద్ర ఇప్పుడు మరోసారి సింగరేణి పరిధిలోని బ్లాకులకను వేలానికి పెట్టిందని, ఇలా చేయడం వల్ల సింగరేణి లాంటి సంస్థను కుదేలు చేయడమే అన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయన్నారు.. వాటిని కేటాయిస్తే సింగరేణి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. బొగ్గు గనుల కోసం ప్రధానిని.. కిషన్‌రెడ్డిని ఒప్పించాలన్నారు. తాను, సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానితో మాట్లాడేందుకు వస్తామన్నారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అనంతరం సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని శ్రావణ పల్లి గనిని సింగరేణికే ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

Latest News