Site icon vidhaatha

Vijayashanti | బంగ్లాదేశ్ పరిణామాలపై విజయశాంతి విచారం.. హిందువులపై జరిగిన దాడులకు ఖండన

విధాత : బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై సినీ నటి, కాంగ్రెస్‌నేత విజయశాంతి ట్విటర్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. హిందువులు, హిందువుల అస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఘోరాల వీడియోలు చూసి ఎవరైనా తల్లడిల్లే పరిస్థితులు కలిచివేశాయన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. అదే సమయంలో అక్కడ కేవలం హిందువులనే గాక మాజీ ప్రధాని హసీనా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన అనేకమంది హత్యకు గురయ్యారని తెలిపారు. వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు కూడా విధ్వంసానికి గురయ్యాయని, నటుడు, నిర్మాత అయిన ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వీరూ ముస్లింలేనని, ఎవరెవరిపైనో ఎవరెవరికో ఉన్న పాత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు, ఇంకెందరో తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని హిందూ విద్వేష ఉగ్రవాద శక్తులు కూడా అందులోకి చొరబడ్డాయని ఆరోపించారు. నిరసనల మాటున హిందూ విద్వేషాన్ని ఈ మారణకాండ రూపంలో వెల్లడించాయన్నారు. ఉగ్రవాదాన్ని ద్వేషిద్దాం.. పై సంఘటనలను తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిద్దామని పిలుపునిచ్చారు.

Exit mobile version