Site icon vidhaatha

Telangana | బౌరంపేట రోడ్లపై వరినాట్లతో గ్రామస్తుల నిరసన

మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం

విధాత, హైదరాబాద్: దుండిగల్ మున్సిపాలిటీ పాలకుల నిర్లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటలో అధ్వానంగా మారిన రోడ్లపై ప్రజలు మండిపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గుంతల మయంగా ఉన్న రోడ్డు వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు, మహిళలు రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి మున్సిపల్ కమిషనర్ పనితీరుపైన, పాలకుల నిర్లక్ష్యంపైన నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి నుండి బయటకు వచ్చిన గ్రామస్తులు, మహిళలు రోడ్డు గుంతల్లో వరినాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఇందుకేనా మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకుందని, ఇందుకేనా మేము నెల నెల టాక్స్‌లు కట్టి మీకు వేతనాలు అందిస్తున్నామంటూ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. రోడ్లు బాగా లేకపోవడం వల్ల వృద్ధులు మహిళలు పిల్లలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షాకాలంలో గుంతల రోడ్డుపై ప్రయాణంతో ప్రమాదాల పాలవుతున్నామని బౌరంపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version