Site icon vidhaatha

Warangal Urban Cooperative Bank Elections | అర్బన్ బ్యాంకు ఎన్నిక ‘రాజకీయ’ జాతర.. ప్రదీప్ రావు ప్యానెల్ విజయం 

విధాత, వరంగల్ ప్రతినిధి:

Warangal Urban Cooperative Bank Elections | ఆర్ధికలావాదేవీలకు నిలయమైన వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు నూతన పాలకవర్గం ఎన్నిక రాజకీయ జాతరను తలపించింది. రూ.400 కోట్ల లావాదేవీలతో రోజురోజుకు నూతన బ్రాంచ్లతో విస్తరిస్తున్న బ్యాంకుపై రాజకీయవర్గాల కన్నుపడింది. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న రాజకీయ జోక్యం ఇప్పుడు బహిర్గతమయ్యాయనే చర్చ సాగుతోంది. పార్టీలు ప్రత్యక్షంగా ప్యానెళ్లు ప్రకటించి ఎన్నికల్లో పాల్గొనకపోయినప్పటికీ తెరవెనుక ప్రధాన రాజకీయ పక్షాల ముఖ్యనాయకులంతా పావులు కదిపారు. పైకి మాత్రమే బ్యాంకు ఎన్నికలంటూనే ఎవరికి వారు రాజకీయ రంగులు రుద్దుకునేందుకు పోటీపడ్డారు. పోలింగ్ నిర్వహించిన ఏవీవీ విద్యాసంస్థల పరిసరాల్లోకి వేలాది మంది రావడంతో అక్కడ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. వందలాది వాహనాలు, అనుచరులు, గుంపులు,గుంపులుగా తమ తమ అభ్యర్ధులను గెలుపించుకునేందుకు రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నగర వాసులు ఇబ్బందులకు లోనయ్యారు. విద్యాసంస్థల వర్కింగ్ డే రోజు పోలింగ్ నిర్వహించడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. విద్యాశాఖ ఏం చేస్తున్నట్లు అంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. సహకారం శాఖ ఎలా? అక్కడ ఎన్నికలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఉత్కంట భరితంగా సాగిన ఎన్నికల్లో ప్రదీప్ రావు చైర్మన్‌గా ఆయన ప్యానెల్ విజయం సాధించింది.

పట్టుకోసం తెరవెనుక చక్రం

గత నెలరోజులుగా బ్యాంకు పాలకవర్గం ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావుకు మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. గత 20 సంవత్సరాలుగా ప్రదీప్ రావు బ్యాంక చైర్మన్గా ఛక్రం తిప్పుతున్నారు. దీన్ని సహించలేక బ్యాంకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటిని మంత్రి సురేఖ తన రాజకీయ పలుకుబడితో వాయిదా వేయించారని ప్రదీప్రావు బహిరంగంగా విమర్శలు చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ జాతర

కారణాలేమైనా గురువారం ఎన్నికలు నిర్వహించారు. గత పది రోజులుగా నగరంలోని బ్యాంకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదీప్ రావు ప్యానెల్ అభ్యర్ధులతో పాటు ప్రత్యర్థి వర్గం ప్రతినిధులు శతవిధాలుగా ప్రయత్నించారు. గతంలో ఎన్నడూలేనంత కేంద్రీకరించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా కృషి చేశారు. హోరాహోరిగా కనిపించినప్పటికీ ఓటర్లుఏకపక్షంగా తీర్పునిస్తూ ప్రదీప్ రావు ప్యానెల్ కు విజయాన్ని కట్టబెట్టారు. ఈ సందర్భంగా వారంతా భారీ ర్యాలీ నిర్వహిస్తూ టపాసులు కాల్చిసంబరాలు చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం: ప్రదీప్ రావు

వరంగల్ కో-ఆపరేటివ్ బ్యాంకు ను తెలంగాణ మొత్తం విస్తరిస్తామని ప్రదీప్ రావు చెప్పారు. బ్యాంక్ అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ వ్యక్తిని అయినప్పటికీ తనను ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేశారన్నారు. తనకు అన్ని పక్షాలు సహకరించాయన్నారు.

Exit mobile version