విధాత : ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలవడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరించి ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారన్నారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్నారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమా లేదా అపహస్యం చేయడమా అని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామనీ కేటీఆర్ తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సుప్రీంకు వెళ్తాం : కేటీఆర్
