Site icon vidhaatha

కమిషన్ ముందు … కేసీఆర్ హాజరైతే నష్టమేమిటి

ఇందిరాగాంధీ కూడా హాజరయ్యారు
వ్యవస్థలను గౌరవించాల్సిందే
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ఫ్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైతే వచ్చే నష్టమేమిటని, గతంలో ఇందిరాగాంధీ వంటి వారే కమిషన్ ఎంక్వయిరీలను గౌరవించి కమిషన్ ముందు హాజరయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. జ్యుడీషియల్ కమిషన్ చట్టబద్ధమైందని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కోరిక మేరకే కమిషన్ వేశామని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం బీఆరెస్ హయంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, ఫ్లాంట్ల నిర్మాణాల అవకతవకలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిపిందని, శ్వేత పత్రం విడుదల చేసిందన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయమన్నారని, ఇప్పుడు ఎలా వేస్తారని, కమిషన్ ఏర్పాటును ప్రశ్నిస్తూ చైర్మన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను ఎవరైనా గౌరవించాలని, మనకు తగ్గట్లుగా వ్యవస్థలు ఉండవని, వ్యవస్థల మేరకు మనమంతా నడుచుకోవాలన్నారు. మేం కమిషన్ విచారణలో తల దూర్చడం లేదని, న్యాయ స్థానాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకం గౌరవం ఉండాలని, మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తికి అదంతా తెలియంది కాదన్నారు.

Exit mobile version