హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ దారెటు? ఆకాశాన్నంటుతున్నఅపార్ట్‌మెంట్‌ల ధరలు

కూడు, గుడ్డ, నీడ.. ఒక మనిషి కనీసావసరాలు. కూడు, గుడ్డకోసం ఎన్ని తిప్పలు పడుతున్నా.. నీడ కోసం మాత్రం తపించిపోతున్నాడు. ఈ భూమిపై తనకంటూ ఒక ఇల్లు ఉండాలనే సగటు మనిషి కల నెరవేరడం లేదు

  • Publish Date - June 20, 2024 / 12:59 AM IST

మూడేళ్లుగా కొత్త లాంచింగ్స్‌ వెల్లువ
దేశంలో ఖాళీగా కోటి 14 లక్షల యూనిట్లు
భారీగా పెరిగిపోతున్న ప్రీమియం ఫ్లాట్లు
సామాన్యులకు నెరవేరని సొంతింటి కల

హైదరాబాద్‌: కూడు, గుడ్డ, నీడ.. ఒక మనిషి కనీసావసరాలు. కూడు, గుడ్డకోసం ఎన్ని తిప్పలు పడుతున్నా.. నీడ కోసం మాత్రం తపించిపోతున్నాడు. ఈ భూమిపై తనకంటూ ఒక ఇల్లు ఉండాలనే సగటు మనిషి కల నెరవేరడం లేదు. కానీ.. నగరాల్లో ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లు వెల్లువలా పుట్టుకొస్తున్నాయి. ఇదే కాదు.. ఒక మోస్తరు అపార్ట్‌మెంట్ల ధరలు సైతం సాధారణ ప్రజలు కొనుగోలు చేసేందుకు భయపడేలా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వంటి టాప్‌ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం స్తబ్దతను చవిచూస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెవలపర్ల ధోరణి ఇలానే కొనసాగితే.. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. 2023 సెప్టెంబర్‌ 30 నాటికి ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 1.28 లక్షల యూనిట్లు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని ఆనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ పేర్కొన్నది. దేశంలోని ఏ నగరంలోనూ ఇన్ని యూనిట్లు ఖాళీగా లేవని తెలిపింది. 2023 జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలోనే 8152 కొత్త యూనిట్లు హైదరాబాద్‌లో లాంచ్‌ అయ్యాయి. అందులో 6735 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయని పేర్కొన్నది. ధరల అంశమై కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ పరంగా హైదరాబాద్‌ నగరం రెండో అతి ఖరీదైన మార్కెట్‌గా ఉన్నదని పేర్కొంటున్నారు. అలాంటి హైదరాబాద్‌లో 1.28 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఇళ్లు పడావు పెట్టడం జాతీయ నేరం: హరిబాబు
కోటిన్నరపైగా విలువ చేసే విలాసవంతమైన నివాస గృహాల లాంచింగ్స్‌ 2019, 2023 మధ్యకాలంలో వెయ్యి రెట్లు పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ఆనరాక్‌ పేర్కొంటున్నది. ఇదే సమయంలో దేశంలోని టాప్‌ ఏడు నగరాల్లో 75 లక్షలకు లోపు లభించే యూనిట్ల లాంచింగ్‌లలో స్తబ్దత నెలకొన్నది. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏఆర్‌ఈడీసీవో) జాతీయ అధ్యక్షుడు హరిబాబు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లో ఒకవైపు అందుబాటు ధరలలో ఉండే ఇళ్ల సెగ్మెంట్‌లకు భారీ డిమాండ్‌ ఉంటే.. మరోవైపు ప్రీమియం ఇళ్ల నిర్మాణ ధోరణి పెరుగుతుండటాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 2022లో అందుబాటు ధరల్లో ఉంటే ఇళ్లు లేదా ఫ్లాట్లు 5,300 యూనిట్లు అమ్ముడుపోగా.. అదే 2023లో 3,800 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపారు. అంటే.. ఏడాదిలోనే 1500 యూనిట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో లగ్జరీ సెగ్మెంట్‌లో పెరుగుదల ఉన్నదని చెప్పారు. దేశ ప్రజల సంపద పెరిగింది కానీ.. సంపద పంపిణీ సమానంగా లేదని పేర్కొన్నారు. 31.5 శాతం సంపద కేవలం టాప్‌ 1 శాతం జనాభా చేతిలోనే ఉన్నదని, మరో 31.5 శాతం సంపద 9శాతం మంది వద్ద కేంద్రీకృతమైందని వివరించారు. అంటే.. మొత్తంగా పదిశాతం మంది అంటే.. సుమారు 14 కోట్ల మంది వద్దే సంపద వృద్ధి అనేది ఉంటున్నదని తెలిపారు. చాలా మంది బిల్డర్లు ఈ పదిశాతం మందిని టార్గెట్‌ చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు.

ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాలకు ఇళ్ల కొనుగోళ్లు
దేశంలో ప్రస్తుతం కోటీ 14 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ పెట్టుబడి కింద కొనుగోలు చేసినవేనని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో ఇప్పుడు కోటి రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఎలాంటి పన్నులు చెల్లించకుండానే మరుసటి ఏడాదికే కోటీ 80 లక్షలకు చేరుతున్నదని హరిబాబు తెలిపారు. అదే సొమ్మును బ్యాంకులో దాచుకుంటే.. ఏడు శాతం వడ్డీ రూపేణా లభిస్తందని, అందులోనూ 30 శాతం పన్ను కింద పోతుందని, అంటే నికరంగా లభించేది ఐదు శాతం వడ్డీ మాత్రమేనని చెప్పారు. ప్రి లాంచ్‌ సేల్స్‌లో ఇన్వెస్టర్లకు సగం ధరకే లభిస్తున్నాయని అన్నారు. ప్రి లాంచ్‌ ఇన్వెస్టర్లు కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ కోసమే తప్ప, వాటిని అద్దెకు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇటువంటి ఆస్తులను నిరుపయోగంగా ఉంచడం జాతీయ నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు ఇళ్ల రంగంలో కొరత ఉన్నదని చెబుతూ.. మరోవైపు కోటీ 14 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉంచడం హాస్యాస్పదకమని అన్నారు. ఇలా ఇళ్లను ఖాళీగా ఉంచితే రెండింతలు, మూడింతలు ఆస్తిపన్ను విధిస్తామని ప్రభుత్వం చట్టం తెస్తే.. ఇన్వెస్టర్లు మరో మార్గం లేక వాటిని అద్దెకు ఇవ్వడమో, అమ్ముకోవడమో చేస్తారని హరిబాబు అభిప్రాయపడ్డారు.

పేదలకు దొరికేది ఎక్కడ?
మూడు ఆదాయవర్గాలైన ఆర్థికంగా వెనుకబడినవారు (ఈడబ్ల్యూఎస్‌), తక్కువ ఆదాయం కలిగినవారు (ఎల్‌ఐజీ), మధ్యతరగతి (ఎంఐజీ).. వీరిలో ఈడబ్ల్యూఎస్‌ ప్రజల్లో దాదాపు 60 శాతం మంది తమకు తగిన ఆదాయాలు లేని కారణంగా.. ప్రభుత్వాలు అందించే ఇళ్లలోనో, అద్దె ఇళ్లలోనో నివసిస్తుంటారని హరిబాబు తెలిపారు. వీరిలో సగం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంటారని, కనీసం 30 లక్షలకు ఫ్లాట్‌ కొనుగోలు చేయాలన్నా.. నెలకు కనీసం 30వేలు ఈఎంఐ కట్టాల్సి రావడంతో అందుకు సాహసం చేయడం లేదని చెప్పారు. అందుబాటు ధరల్లో లభించే ఇండ్ల ప్రాజెక్టుల ద్వారా లభించే ఆదాయంపై డెవలపర్లకు 80 ఐబీఏ కింద పన్ను మినహాయింపు పొందేందుకు ప్రభుత్వం ఇంటి విస్తీర్ణం, వ్యయంపై గరిష్ఠ పరిమితులను విధించిందని, దీని ప్రకారం.. హైదరాబాద్‌లో స్థూల విక్రయ ప్రాంతం పరిమితిని వెయ్యి చదరపు అడుగులుగా, ధరను 45 లక్షల రూపాయల కంటే తక్కువగా నిర్ణయించారని హరిబాబు తెలిపారు. మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను ఇది కనుమరుగైపోయిందని, కనిష్ఠ ధర కూడా 60 లక్షలకు చేరుకున్నదని వివరించారు. మధ్య తరగతివర్గాలు ఇళ్లను కొనుగోలు చేయగలిగేలా ధరలను కిందికి తీసుకువస్తే.. సరసమైన ధరలకు దొరికే ఇళ్ల అమ్మకాలు 25 శాతం నుంచి 30 శాతం వరకూ పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అనుకుంటున్నామని, అభివృద్ధి చెందిన దేశాల్లో 96 శాతం మంది ఇంటి సదుపాయం కలిగి ఉంటారని హరిబాబు తెలిపారు. కానీ మన దేశంలో ఇంకా 40 శాతం జనాభా మురికివాడల్లోనే ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఎదగగలమని ఆయన ప్రశ్నించారు.