Site icon vidhaatha

BC reservation Telangana | రాజ్ భవన్ కు చేరిన బీసీ రిజర్వేషన్ల ముసాయిదా ఆర్డినెన్స్

BC reservation Telangana | బీసీ రిజర్వేషన్ల ముసాయిదా ఆర్డినెన్స్‌ను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు రాజ్ భవన్ కు పంపింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తింపచేసేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు పంచాయితీరాజ్ చట్టం 2018 లోని 285 (ఏ) ను సవరిస్తూ రాజ్ భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపింది. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ‘స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు అవుతాయి’ అనే వాక్యం తొలగించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయని చేర్చారు. ఈ మార్పుతో ముసాయిదా ఆర్డినెన్స్ ను రాజ్ భవన్ కు పంపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్లు మొత్తం 70 శాతానికి చేరుతాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లను 9 షెడ్యూల్ లో చేర్చారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తే ఇందుకు సంబంధించి డేటా శాస్త్రీయంగా సేకరించిందేనని కోర్టుల్లో రుజువు చేయాల్సి ఉంటుంది. అలా రుజువు చేయలేకపోతే కోర్టుల్లో అవి నిలబడవు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఈ నెల 24 వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ఆర్డినెన్స్ వస్తేనే రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగుతోంది. ముసాయిదా ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదం పొందితే రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు వెళ్లనుంది.

Exit mobile version