Mayday call | విమాన ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ వినిపించే పదం ‘మేడే’ కాల్. దీనికి లోతైన అర్థం ఉన్నది. మేడే అనేది .. మాయిడెజ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘నాకు సహాయం చేయండి’ అని. ఏవియేషన్, మారిటైమ్ కమ్యూనికేషన్లలో అంతర్జాతీయంగా వాడే పరిభాషలో ఈ మేడే కాల్ అనేది అతి తీవ్రమైన రేడియో సంకేతం.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పైలట్ మేడే, మేడే, మేడే అంటూ మూడుసార్లు పలకడం అనేది విమానంలో ఇంజిన్ వైఫల్యం, మంటలు, నియంత్రణ కోల్పోవడం లేదా ఆకస్మిక డీకంప్రెషన్‌ను సూచిస్తుంది. ఏదైనా విమానం నుంచి ఈ కాల్ వచ్చిందంటే రేడియో ట్రాఫిక్, ఏటీసీ వెంటనే అలర్ట్ అయి.. ఎమర్జెన్సీ ప్రొటోకాల్ కోసం వెంటనే ఏర్పాట్లు చేస్తాయి.
విమానాలు ప్రమాదంలో ఉన్నప్పుడు కఠినమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొటోకాల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తప్పనిసరి చేసింది.
అత్యవసర పరిస్థితి ప్రకటన మూడు దశల్లో ఉంటుంది. అవి అస్థిరత (INCERFA), అప్రమత్తత (ALERFA), ఆపద (DETRESFA). వీటిలో మేడే కాల్ అనేది DETRESFA కిందికి వస్తుంది. అది అత్యంత సంక్లిష్టమైనది.
మేడే కాల్ ప్రకించిన వెంటనే ఏటీసీ వెంటనే ఇతర ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలి. విమానంతో నేరుగా కమ్యూనికేషన్ సంబంధాల్లోకి వెళ్లాలి. ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తో సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే సమీప ఎయిర్‌బేస్‌ల సహకారం తీసుకోవాలి.
ఏఆర్‌ఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే క్రియాశీలం చేయటం : ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ (ఏఆర్‌ఎఫ్‌ఎఫ్) యూనిట్లు.. క్రాష్ టెండర్లు, అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలతో ఉంటాయి. అవి రన్‌వే లేదా విమాన మార్గం సమీపంలో ఏ క్షణమైనా స్పందించేలా సిద్ధంగా ఉంటాయి.
ఎమర్జెన్సీ సర్వీసెస్ మొబిలైజేషన్ : పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్)తోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కలుపుకొని ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. ఫ్లైట్ డాటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)ను సేకరించే పని ప్రారంభిస్తాయి. వాటి ఆధారంగా ఆఖరు క్షణాలను రీకన్‌స్ట్రక్ట్ చేస్తాయి.