‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో

తనకు కొరివి పెట్టాల్సిన కొడుకు కళ్లముందే చనిపోతే ఆ తండ్రి గుండెకోత వర్ణనాతీతం. అలాంటి గుండెకోత అనుభవించాడొక తండ్రి. బృందావన్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో 21 ఏళ్ల యువకుడు కరెంటు షాక్‌ తగిలి దుర్మరణం పాలయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట నెటిజన్ల గుండెలు పిండాయి.

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ఇస్కాన్‌ ఆలయంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నది. అక్కడ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కూలర్‌ను తాకిన 21 ఏళ్ల యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాధితుడి పేరు అభిగ్యాన్‌ గుప్తా. తన తండ్రితో కలిసి ఆలయానికి వచ్చిన సమయంలో సోమవారం ఉదయం ఈ ఘోరం సంభవించింది. తన కుమారుడిని కాపాడుకునే క్రమంలో తండ్రికి కూడా షాక్‌ తగిలింది. అయితే.. ఆయనకు మాత్రం ప్రమాదం తప్పింది.

చల్లదనం కోసం కూలర్లు పెడితే..

ఎండలు మండిపోతుండటంతో భక్తుల చల్లదనాన్ని ఇచ్చేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది ఈ ఆలయం వద్ద ఫ్యాన్‌–కూలర్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. అందులో ఒకటి లోపభూయిష్టంగా ఉన్నది. అందులోకి విద్యుత్తు ప్రసరిస్తున్నది. అభిగ్యాన్‌ గుప్తా తన తండ్రి అమిత్‌కుమార్‌ గుప్తాతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఛాత్రపూర్‌ నుంచి ఇస్కాన్‌ టెంపుల్‌కు వచ్చాడు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో చెప్పుల స్టాండ్‌ వద్ద  అనుకోకుండా యువకుడి చేయి.. అప్పటికే విద్యుత్‌ ప్రసరిస్తున్న కూలర్‌ను తాకింది. షాక్‌ కొట్టగానే అభిగ్యాన్‌ పెద్ద పెట్టున అరిచాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కొడుకు కేకలు విని అతడిని కాపాడేందుకు తండ్రి ప్రయత్నించగా.. కరెంటు షాక్‌ తగిలి.. ఆయన ఎగిరిపడ్డాడు. అభిగ్యాన్‌ మాత్రం బయటపడలేకపోయాడు. చుట్టుపక్కలవారు కూలర్‌ నుంచి అభిగ్యాన్‌ను వేరు చేసేందుకు ప్రయత్నించి, వెంటనే జిల్లా సంయుక్త హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే అభిగ్యాన్‌ చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు.

తండ్రి వేదన.. వీడియో వైరల్‌

ఇదే హృదయాన్ని కలచివేసిందనుకుంటే.. హాస్పిటల్‌లో తండ్రి వేదన అంతా ఇంతా కాదు. నిర్జీవంగా పడి ఉన్న తన ఏకైక కుమారుడిని ఆయన వదల్లేకపోయారు. కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ.. ‘లే కొడకా.. నాన్న పిలుస్తున్నాడు..’ (Uth ja beta, papa bula rahe hai) అంటూ ఆయన పిలుస్తుండటం చుట్టుపక్కలవారికి సైతం కంట నీరు తెప్పించింది. తమ ప్రయత్నాలన్నీ చేశామని వైద్యులు చెప్పినప్పటికీ వినకుండా.. తన కొడుకును తట్టిలేపేందుకు, సీపీఆర్‌ చేసేందుకు సైతం ఆయన ప్రయత్నించారు. ఈ భావోద్వేగ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో అశేష నెటిజన్ల మనసును కలచివేశాయి.

నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎయిర్‌ కూలర్ల నిర్వహణలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్లక్ష్యమే ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నదని మండిపడ్డారు. యువకుడి మృతదేహానికి పంచనామా నిర్వహించిన పోలీసుల.. పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది.

Latest News