విధాత : తన జుట్టుకు మంటలు అంటుకున్నా..ఏ మాత్రం బెదరకుండా ప్రశాంతంగా ఆర్పేసిన ఓ యువతి (Girl Hair Fire)వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాణాంతకైన ప్రమాద సమయంలో ఆ యువతి చూపిన మానసిక స్థైర్యం, సమయస్ఫూర్తి అందరికీ పాఠమని..ప్రమాదం ఎదురైనప్పుడు కంగారు పడకుండా సమస్యను ఎదుర్కోవడం వ్యక్తిత్వానికి నిదర్శనమని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
క్రిస్మస్ కు ముందు అమెరికా అరిజోనాలోని నేషనల్ జూనియర్ హానర్ సొసైటీ స్కూల్ ప్రవేశ వేడుకలో అమ్మాయిలు వేదికపై కొవ్వొత్తులు వెలిగించి చేతిలో పట్టుకుని నిలబడ్డారు. వారిలో ఒక అమ్మాయి చేతిలోని కొవ్వొత్తి మంట తన జుట్టుకు అంటుకుంది. సాధారణంగా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే గట్టిగా కేకలు వేస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతూ అటుఇటు పరుగెత్తడం చేస్తుంటారు. కానీ ఆ అమ్మాయి ఏ మాత్రం ఆందోళన చెందలేదు. వెంటనే ఆమె ప్రశాంతంగా భయపడకుండా తన చేతితో జుట్టుకు వ్యాప్తిస్తున్న మంటను ఆర్పేసింది. నవ్వుతూ మళ్లీ అక్కడే నిల్చుంది.
మంటలు అంటుకున్నా.. నిలుచున్న చోటు నుంచి కదల్లేదు..మనసులో నుంచి ఎలాంటి ఆందోళన ఛాయలను బయటకు వ్యక్తీకరించలేదు. పక్కనున్న అమ్మాయిలు ఆందోళన పడినా తను మాత్రం ప్రశాంతంగా ఏమీ జరుగనట్లుగా నిబ్బరంగా కనిపించింది. కార్యక్రమానికి ఎక్కడా ఆటంకం కల్గకుండా తను అందులో భాగస్వామిగా కొనసాగింది. ప్రమాద సమయంలో అమ్మాయి చూపిన సమయ స్ఫూర్తిని..లౌక్యంగా, ప్రశాంతంగా మంటలను అర్పేసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆమె స్పందించిన తీను నుంచి ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
కష్ట సమయంలో ఆందోళన పడితే పరిస్థితి మనిషిని మరింత గందరగోళ పరిచి సమస్య తీవ్రతను పెంచుడుతుందని..అటువంటి పరిస్థితులను సరైన రీతిలో ఎదుర్కొంటే మానసిక స్థైర్యం పెరుగుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.
