భారీగా పట్టుబడిన పాము విషం.. విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

జార్ఖండ్‌ రాష్ట్రం పలమావు ప్రాంతంలో భారీఎత్తున అక్రమంగా నిల్వ చేసి ఉన్న పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు స్మగ్లింగ్‌ చేసే ప్రయత్నాల్లో ఉండగా అధికారులు మాటువేసి.. పట్టుకున్నారు. మార్కెట్‌లో ఈ పాము విలువ చాలా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

snake milking

రాత్రికి రాత్రే పెద్దమొత్తంలో డబ్బు సంపాదించేందుకు కొందరు స్మగ్లింగ్‌ను ఎంచుకుంటుంటారు. తమ ప్లాన్లను మించి ప్లాన్లు వేసే అధికారులు కూడా ఉంటారని తెలియక దొరికిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పలమావు టైగర్‌ రిజర్వ్‌ (PTR), వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్ బ్యూరో జాయింట్‌ టీమ్‌ ఒకటి.. భారీ ఎత్తున స్మగ్లింగ్‌ చేస్తున్న పాము విషాన్ని పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర వింటే కళ్లే తేలేయడం ఖాయమని అధికారులు అంటున్నారు. నిజానికి పాము విషం చాలా ప్రమాదకరమైనది. హెర్పటాలజిస్టులు ఎంపిక చేసిన ప్రయోగశాలల్లో పాముల నుంచి విషాన్ని తీస్తూ ఉంటారు. ఈ విషాన్ని పాము కాటు విరుగుడు ఇంజక్షన్లతోపాటు.. కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఈ విషాన్ని సేకరించే ప్రక్రియ ఎంతో ప్రమాదకరమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు దక్కవు. అంతటి ప్రమాదకరమైన ప్రక్రియను కొందరు అక్రమంగా నిర్వహిస్తూ విషాన్ని తీసి, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేస్తూ ఉంటారు.

తాజాగా జార్ఖండ్‌లో పట్టుబడిన విషం విషయానికి వస్తే.. మొత్తం ఒక కిలో 200 గ్రాములు ఉందని పీటీఆర్‌ అధికారులు తెలిపారు. ఈ విషాన్ని స్థానికంగా సేకరించి, విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేసి ఉంచారు. ఈ విషంతోపాటు.. రెండున్నర కిలోల బరువున్న పాంగోలిన్‌ చర్మాన్ని కూడా అధికారులు ఈ ఆపరేషన్‌ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. పలమావు ప్రాంతంలో అక్రమంగా పాము విషం వ్యాపారం జరుగుతున్నదని తమకు విశ్వసనీయ సమాచారం అందిందని పీటీఆర్‌ అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో తండ్రీ, కొడుకు కూడా ఉన్నారు. ‘ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉన్నది. స్థానికంగా సేకరించిన విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. వీటిని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తాం’ అని పీటీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రజేశ్‌కాంత్‌ జెనా మీడియాకు చెప్పారు. స్వాధీనం చేసుకున్న విషం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 80 కోట్ల రూపాయలు ఉంటుందని, పాంగోలిన్‌ చర్మం 20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అరెస్టయినవారిలో బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన దేవ్‌ ప్రాంత వాసి ముహమ్మద్‌ సిరాజ్‌ (60),  ఆయన కుమారుడు మిరాజ్‌ (36), పలమావులోని హరిహర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కవాఖో ప్రాంత వాసి రాజు కుమార్‌ షుండిక్‌ (50) ఉన్నారు.

Latest News