దిల్లీ: కొవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన చిన్నారుల అక్రమ దత్తతపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం చిన్నారుల పరిరక్షణకు సంబంధించిన పిటిషన్‌ను విచారించింది.
మహమ్మారి వల్ల అనాథలుగా మారిన పిల్లల అక్రమ దత్తత సమస్య గురించి జాతీయ బాలల హక్కుల కమిషన్ సుప్రీంకు విన్నవించింది.పిల్లల వివరాలను బహిర్గతం చేస్తూ, దత్తతకు ఆహ్వానిస్తూ చక్కర్లు కొడుతున్న పోస్టులపై తన పిటిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మార్గాల్లో దత్తత తీసుకోవడం జువినైల్ జస్టిస్ చట్టానికి విరుద్ధమని తెలిపింది. ఆ చట్టం ప్రకారం సెంట్రల్ ఆడాప్షన్ రిసోర్స్ ఆథారిటీ(CARA) ద్వారానే చిన్నారుల దత్తత ఉండాలి. ఈ క్రమంలో బాధిత చిన్నారుల వివరాలు బహిర్గతం చేసి వారి పేరిట ఎన్జీఓలు నిధులు సేకరించకుండా, దత్తతకు వ్యక్తులను ఆహ్వానించకుండా సుప్రీం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఈ తరహా చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కారా ప్రమేయం లేకుండా దత్తతకు అనుమతి లేదు. అలాగే బాధిత పిల్లలు తమ విద్యను కొనసాగించేలా చూడాలి’ అని ధర్మాసనం సూచనలు చేసింది.
మార్చి 2020 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా ఆసరా కోల్పోయిన పిల్లల వివరాలను బాల స్వరాజ్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని జూన్ ఒకటిన సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఆ పిల్లల సంఖ్య 30,071గా ఉందని జూన్ 6న కమిషన్ కోర్టుకు వెల్లడించింది. బాల స్వరాజ్ వెబ్‌సైట్‌ను బాలల హక్కుల కమిషన్ నిర్వహిస్తోంది.