విధాత: గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్ల వ్యవహారం ఎంత అడ్డదిడ్డంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చక్కని నిదర్శనంగా కనిపిస్తుంది. రోడ్డు మధ్యలో చెట్లు..విద్యుత్తు స్తంభాలు ఉన్నా…పాత చేతిపంపులు ఉన్నా అలాగే సీసీ రోడ్లు వేసిన నిర్వాకం గతంలో చూశాం. అయితే ఇంటిముందు పార్కింగ్ కారును కూడా పట్టించుకోకుండా కాంట్రాక్టర్, అధికారులు సీసీ రోడ్డు వేసుకుంటుపోవడమే సరికొత్త వింతగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కారును తొలగించకుండానే రోడ్డు వేసిన కాంట్రాక్టర్..అధికారుల నిర్వాకం చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో సిమెంట్ రోడ్డు వేశారు. రోడ్డు నిర్మాణ క్రమంలో ఆ వీధిలోని బుద్ది వెంకట రమణ ఇంటి ముందు కారు పార్కింగ్ చేసి ఉంది. కారును తీయకుండా సిమెంట్ రోడ్డు వేసేశారు. దీంతో సీసీ రోడ్డు నిర్మాణం అడ్డదిడ్డంగా సాగిపోయింది.
అయితే ఈ ఘటనపై స్థానిక పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ సీసీ రోడ్డు నిర్మాణం సందర్భంగా ఏడాదిగా ఆ స్థలంలో పార్కింగ్ చేయబడిన కారును తొలగించాలని చెప్పామని..అయితే సంబంధిత వ్యక్తులు వినకుండా వెళ్లిపోయారని వివరణ ఇచ్చారు. చేసేది లేక ప్రజలకు ఇబ్బంది ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కాంట్రాక్టరు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశాడని తెలిపారు.
కారు తీయకుండానే సీసీ రోడ్డు వేశారు! (వీడియో) #baptla #AndhraPradesh #viralvideo #viral pic.twitter.com/FUe2hH4ika
— srk (@srk9484) April 16, 2025