Lok Sabha Elections 2024 | బీజేపీ సొంతంగా మెజార్టీ మార్క్‌ను చేరకపోతే?

గత ఎన్నికల్లో బీజేపీ గంపగుత్తగా గెలుచుకున్న సీట్లు ఈదఫా తగ్గబోతున్నాయనేది గత మూడు దశల పోలింగ్‌ సరళి.. ఆ తర్వాత కొంత మంది రాజకీయ విశ్లేషకుల అంచనాలు తెలియజేస్తున్నాయి.

  • Publish Date - May 13, 2024 / 05:46 PM IST

కూటమికే మెజార్టీ దక్కదంటున్న విశ్లేషకులు
ఎన్డీయేలో బీజేపీ మినహా బలమైన పక్షం ఏది?
బీహార్‌లో ప్రభ తగ్గిపోయిన నితీశ్‌కుమార్‌

(విధాత ప్రత్యేకం)

గత ఎన్నికల్లో బీజేపీ గంపగుత్తగా గెలుచుకున్న సీట్లు ఈదఫా తగ్గబోతున్నాయనేది గత మూడు దశల పోలింగ్‌ సరళి.. ఆ తర్వాత కొంత మంది రాజకీయ విశ్లేషకుల అంచనాలు తెలియజేస్తున్నాయి. బీజేపీ 2019లో గెలుచుకున్న 303 సీట్ల నుంచి 70 సీట్ల వరకు కోల్పోయి 233 వరకు గెలుచుకుంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌ చెబుతున్నారు. అలాగే ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు 353 ఉంటే ఇప్పుడు అవి ఇప్పుడు 268 తగ్గవచ్చు అనేది ఆయన వాదన. 2014, 2019లలో బీజేపీ సొంతంగానే 272 మార్క్‌ దాటింది. దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్యపార్టీలు మౌనంగా ఉన్నాయి. తట్టస్థంగా ఉన్న పార్టీలు కూడా తమ రాజకీయ అవసరాలకోసం పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాయి.

ఇప్పుడు కూటమి కలిపినా మెజారిటీకి దూరంగా ఉంటుంది అనేది యోగేంద్ర యాదవ్‌ అంచనా. ఇందులో ఒక వాలీడ్‌ పాయింట్ ఉన్నది. ఎన్డీఏ కూటమి అన్నట్టే కానీ అందులో పెద్ద పార్టీలు ఏవీ లేవు? ఉన్న పార్టీల్లో మహారాష్ట్రలో శివసేన పోయి రెండుగా మారింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ ఎన్డీఏ నుంచి వెళ్లిపోయింది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. దీని వెనుక ఏ పార్టీ ఉన్నదో తెలిసిందే. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పెద్ద పార్టీ అంటే టీడీపీనే. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 430పైగా స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తున్నది. సొంతంగా మెజారిటీ సాధించకపోతే ఆ కూటమిలోని మిగిలిన పార్టీలు పోటీ చేస్తున్న స్థానాలు, వాటికి వచ్చే సీట్ల ఆధారంగా తేలుతుంది. అది అంత తేలికగా ఏమీ కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.

ఉదాహరణకు బీహార్‌లోనే గత ఎన్నికల్లో బీజేపీనే సొంతంగా 17 గెలుచుకుంటే జేడీయూకు 16 వచ్చాయి. ఎల్‌జేపీకి 6 వచ్చాయి. ఎల్జేపీ రెండుగా చీలిపోయింది. ఇప్పుడు అక్కడ నితీశ్‌ ప్రభ లేదు. అక్కడ బలమైన నేత సుశీల్‌ కుమార్‌ మోదీ అనారోగ్యంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మొత్తం మోదీ చరిష్మాతోనే బీహార్‌లో సీట్లు గెలవాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ ఎన్డీఏ కూటమిని నడిపించే స్థాయిలో నితీశ్‌కుమార్‌ లేరు. అధికారం కోసం తరుచూ కూటములు మారుస్తున్నారన్న అసంతృప్తి ప్రజల్లో ఉన్నది. ఒకరకంగా ఆ రాష్ట్రంలో బీజేపీకి ఆయనే మైనస్‌గా మారారు అన్న వాదనలున్నాయి.

కనుక అక్కడ గతంలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవాలంటే మోదీ కరిష్మాతోనే జరగాలి లేదా బీజేపీ విధానాలే ప్రతికూల ఫలితాలకు కారణమౌతాయనే అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే నాలుగోదశలో బీహార్‌లో జరుగుతున్న లోక్‌సభ స్థానాలకు ఓటు వేసిన ఒక యువ ఓటర్‌ను జాతీయ మీడియా ప్రశ్నించింది. ‘మోదీ పదిహేను లక్షలు ఇచ్చారు. బుల్లెట్‌ ట్రైన్‌ ఇచ్చారు. తిరగమన్నారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ యువకుడు. పెరిగిన నిరుద్యోగం గురించి మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నది అతని మాటల్లోని ఆవేదన. మొత్తంగా సొంతగా మెజార్టీ రాకపోయినా.. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలూ గట్టిగా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

మోదీ రిటైర్‌ అవుతారని, అమిత్‌షా కోసమే ఓట్లు అడుగుతున్నారని కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకు వచ్చి బాంబులాంటి మాట పేల్చారు. దేశంలో ఈ వ్యాఖ్య పెను సంచలనమై కూర్చున్నది. దీంతో రాజ్‌నాథ్‌, అమిత్‌షా, నడ్డా హడావుడిగా తమ పార్టీలో రిటైర్మెంట్‌ విధానం లేదని, మళ్లీ బీజేపీ గెలిస్తే మోదీనే ఐదేళ్లూ ప్రధానిగా ఉంటారని వివరణలు ఇచ్చుకున్నారు.

వాస్తవానికి వాజ్‌పేయి, అద్వానీ తర్వాత పార్టీని ఆ స్థాయిలో నడిపించేవాళ్లు ఇప్పుడు లేరు. మూడుసార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌సింగ్‌ లాంటి వాళ్లకు అవకాశం ఇస్తారా? అంటే.. మొన్న ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తేలిపోయింది. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజే లాంటి వాళ్లనూ పార్టీ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. గడ్కరీ లాంటి వాళ్లు ఉన్నా వాళ్లనూ వాళ్ల సొంత నియోజకవర్గాలకే పరిమితం చేశారు. దీన్నిబట్టి వీళ్లెవరూ బీజేపీని గెలిపించే స్థితిలో లేరు అన్నది బీజేపీ వాళ్లే చెబుతున్న మాటలను బట్టి తెలుస్తోంది.

ఇక ప్రాంతీయ పార్టీలు మనుగడలో ఉంటే జాతీయ పార్టీలకు కష్టం. అందుకే ఎప్పటికప్పుడు వాటి అస్తిత్వాన్ని లేకుండా చేయడమే జాతీయ పార్టీలు చేస్తుంటాయి. ఏ రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మనుగడ కొనసాగాలని కోరుకోదు. కానీ కూటమి అంటే అందులో భాగస్వామ్య పార్టీలను గౌరవించడం విషయంలో బీజేపీ కంటే కాంగ్రెసే మేలు అన్న అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే బీజేపీ గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌పార్టీనే కాదు, బీజేపీ అధికారంలో లేని ప్రాంతీయపార్టీలను, చివరికి ఎన్డీఏలోని ప్రాంతీయపార్టీల్లోనూ చీలిక తెచ్చి బలహీన పరిచింది.

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్‌ లేకుండా సాధ్యం కాదు అన్నది అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగాకాంగ్రెస్‌ పార్టీ 326 స్థానాల్లోనే పోటీ చేస్తున్నది. మిగిలిన 217 స్థానాల్లో ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. నిన్న బీహార్‌లో ప్రధాని మాట్లాడుతూ రాహుల్ వయసంత సీట్లకే కాంగ్రెస్‌ పరిమితం ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్‌ గత లోక్ సభ స్థానాల 52 నుంచి 150 సీట్ల మార్క్‌ దాటితే ఏం జరుగుతుందో మోదీకి చెప్పనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Latest News