Site icon vidhaatha

Banakacharla Controversy | ఆంధ్రా కాళేశ్వ‌రం.. బనకచర్ల! ఇక్కడా, అక్కడా మేఘా కోసమే!

నదిని ఎత్తిపోసే పథకమని ప్రచారం చేసుకున్నారు. లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టారు! కానీ.. మూడేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. దానిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని బీఆరెస్‌ పాలిట ఏటీఎం అని అభివర్ణించారు. దాని పేరే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం!

వృథా పోయే గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు అంటున్నారు! 80వేల కోట్ల అంచనా చూపుతున్నారు! ఇందులోనూ కమీషన్లు పంచుకునేందుకు చర్చలు పూర్తయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ‘ఆంధ్రా కాళేశ్వరం’గా తయారై కూర్చుంటుందని సీనియర్‌ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే బనకచర్ల ప్రాజెక్ట్‌!

ఈ రెండింటి మధ్య మరో లింకు కూడా ఉంది! అదే మేఘా ఇంజినీరింగ్‌ ప్రమేయం! కాళేశ్వరం వెనుక ఉన్నదీ మేఘా ఇంజినీరింగ్‌ సంస్థే! ఇప్పుడు బనకచర్లను చేపట్టబోయేది కూడా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థే! ఏపీకి పనికిరాని ప్రాజెక్టును మేఘా కంపెనీ లబ్ధి కోసం చేపడుతున్నారన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

Banakacharla Controversy | బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు తగువులాడుకుంటుంటే.. ఒక్కసారిగా దీని లోగుట్టును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆలోచనాపరుల వేదిక బయటపెట్టడం ఒక్కసారిగా సంచలనం రేపింది. ఈ ప్రాజెక్టు కథా కమామిషు లోతులకు వెళ్లేకొద్దీ.. ఇందులో మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ కీలక పాత్ర కనిపిస్తున్నది. జగమంతా ‘మేఘా’ కోసమే అన్న ప్రచారం నిజమేనా? అనిపిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుకు ముందే నిర్మాణ రంగంలో ఉన్న మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ ప్రాజెక్ట్‌ అయిన కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టింది. నిజానికి ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. భారీ నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో చక్రం తిప్పేది మాత్రం మేఘా సంస్థేనని సీనియర్‌ జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. నాడు అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడిగా చెలామణీ అయిన మేఘా ఇంజినీరింగ్‌ అధినేత కృష్ణారెడ్డి.. ప్రభుత్వాలు మారి తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కూడా సన్నిహితంగా మారిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్‌గా ప్రభుత్వాలను మేఘా శాసిస్తున్నదనే చర్చ వ్యాపార, రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతున్నది. ఇది మేఘా కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగానూ పనికిరాదని ఆంధ్ర మేధావులు కుండబద్దలు కొడుతుండటం విశేషం.

కేసీఆర్‌, జగన్‌ ఆలోచన?

బనకచర్ల ప్రాజెక్ట్‌ నిర్మాణం నాటి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. జగన్‌ ఆఖరి నిమిషంలో పక్కన పెట్టిన ఈ ప్రాజెక్టును అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో జగన్‌, చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. అధికారం పక్షం పనులను సహజంగానే ప్రతిపక్షం విమర్శిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాస్తవాల ఆధారంగా కూడా ఈ విమర్శలు ఉంటాయి. కానీ.. బనకచర్ల విషయంలో మాత్రం ప్రతిపక్ష నేత జగన్‌ మౌనం దాల్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక అసలు సంగతిని చూసే ముందు.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలోకి వస్తే.. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి ఉమాభార‌తి అధ్య‌క్ష‌త‌న‌ 2016 సెప్టెంబ‌ర్ 21వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నాటి ముఖ్యమంత్రుల హోదాలో తెలంగాణ‌, ఏపీల‌కు సీఎంలుగా ఉన్న కేసీఆర్‌, చంద్ర‌బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే 2019 ఆగ‌స్ట్‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో, ఆ త‌రువాత జ‌రిగిన స‌మావేశాల‌లో దీనికి కేసీఆర్ ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ ఈ ప్రాజెక్ట్ కోసం వ్యాప్కోస్‌కు స‌ర్వే బాధ్య‌తలు అప్ప‌గిస్తే అప్ప‌ట్లోనే నివేదిక ఇచ్చింది. దీనిపై ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యేలోపే ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో ఎన్నిక‌ల త‌రువాత‌ చూద్దామ‌ని జ‌గ‌న్ ఆగారని, ఎన్నిక‌ల త‌రువాత చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చార‌ని, దీంతో మేఘా కృష్ణారెడ్డి స్వ‌యంగా చంద్ర‌బాబును క‌లిసి దీనికి ఒప్పించార‌ని ఏపీ మేధావులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు ఫైనాన్షియ‌ల్ అసిస్టెన్స్ కూడా తానే తీసుకువ‌స్తాన‌ని చంద్ర‌బాబుతో కృష్ణారెడ్డి చెప్పారన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తున్నది. రూ.80,112 కోట్ల‌తో ఈ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కార్పోరేష‌న్ కూడా ఏర్పాటు చేసింది.

బ‌న‌క‌చ‌ర్ల‌- మ‌రో కాళేశ్వ‌ర‌మా?

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ ఏపీలో అతిపెద్ద కుంభకోణం కానుంద‌న్న చ‌ర్చ తాజాగా చోటు చేసుకుంటున్నది. ఈ ప్రాజెక్ట్‌నిర్మాణానికి ఆమోదం తెలిపితే ఇచ్చే క‌మిష‌న్‌లో ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు తలా కొంత పంచుకునేందుకు ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై జ‌గ‌న్ మాట్లాడ‌టం లేద‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ తెర‌వెనుక చేతులు కలిపారన్న అనుమానాలను ఏపీకి చెందిన మేధావులు వ్య‌క్తం చేస్తున్నారు. బనకచర్ల నిర్మిస్తే.. అది ఆంధ్రా పాలిట కాళేశ్వరంగా తయారై కూర్చుంటుందని ఏపీకి చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. పౌర స‌మాజం, మేధావులు, జ‌ర్న‌లిస్టుల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. మ‌రో కుంభకోణం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నా చంద్రబాబు ప‌ట్టించుకోకుండా ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపి, ఆ వెంట‌నే కార్పొరేష‌న్ ఏర్పాటు చేశార‌ని ఆయన తెలిపారు. తెలంగాణ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ రూ.80 వేల కోట్ల‌ అంచనాతో చేప‌ట్టారు. దీనిని రెండు టీఎంసీల ఎత్తిపోత‌ల కోసం చేశారు. అలాగే ఏపీలో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ రూ. 80 వేల కోట్ల‌తో చేప‌డుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా రోజుకు 2 టీఎంసీలు ఎత్తి పోసే లక్ష్యంతోనే ఉంటుంది. ఇదంతా గమనిస్తే.. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ వ్యాఖ్యానించిన‌ట్లుగానే కాళేశ్వ‌రానికి, దీనికి పోలిక ఉంటుందా? ఇది కూడా కాళేశ్వరం తరహాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

బనకచర్ల అవసరమేంటి?

ఇప్పుడు గోదావ‌రి బ‌న‌క‌చ‌ర్ల అవ‌స‌రం ఆంధ్రప్రదేశ్‌కు ఏమిటో చంద్ర‌బాబు చెప్ప‌డం లేదు. కృష్ణా నుంచి ఆంధ్రాకు 512 టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే అందులో సాగ‌ర్ కుడి కాలువ కింద 130 టీఎంసీలు, కృష్ణా డెల్టా కింద 150 టీఎంసీలు వాడుకుంటున్నారు. కృష్ణాలో మిగిలిన నీటిని పోతిరెడ్డిపాడు, ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ద్వారా రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లిస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల కింద కాలువ‌ల‌న్నీ పూర్తిచేసి నీటి వినియోగం పెంచితే ఇంకా ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు, ముచ్చుమ‌ర్రి నుంచి తీసుకోవ‌డానికి ఇప్ప‌టికే అవ‌కాశం ఉంది. ఇవి కాకుండా గోదావ‌రి ప‌ట్టిసీమ నుంచి 80 నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణా న‌దికి ఆంధ్ర తెచ్చుకుంటున్న‌ది. కొత్త‌గా బ‌న‌కచ‌ర్ల‌లో ఎత్తిపోయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమీ లేదు. గోదావ‌రి నుంచి కృష్ణాకు తీసుకువ‌స్తున్న నీటిలో రాయ‌ల‌సీమ‌కు, తెలంగాణ‌కు నిక‌ర‌జ‌లాల వాటా ఇస్తే బ‌న‌క‌చ‌ర్ల‌కు కొత్త‌గా నీటిని తేవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. సాగ‌ర్‌, శ్రీ‌శైలంల‌లో ఆంధ్ర వినియోగం త‌గ్గించి రాయ‌ల‌సీమ‌కు కేటాయిస్తే ఇంత భారీ ప్రాజెక్టు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌కు 200 టీఎంసీలకు పైగా నీటిని త‌ర‌లించే కాలువ‌లు, నిలువ చేసే రిజ‌ర్వాయ‌ర్లు పూర్త‌యి వినియోగంలో ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల‌ డిస్ట్రిబ్యూట‌రీ కాలువ‌లు నిర్మించలేదు. కొద్దిపాటి ఖ‌ర్చుతో ఈ కాలువ‌ల నిర్మాణం చేస్తే రాయ‌ల‌సీమ బీడు భూముల‌కు స‌రిప‌డా నీళ్లు అందుతాయని ఆంధ్ర మేధావులు చెబుతున్నారు. గోదావ‌రి నుంచి తెచ్చే జ‌లాల‌ను సాగ‌ర్ కుడికాలువ‌కు, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు ప‌శ్చిమ మెట్ట ప్రాంతాల‌కు నీరందిస్తే రూ. 15000 కోట్ల‌తో ప‌ని పూర్త‌వుతుంది. ఈ అవ‌కాశాల‌న్నింటినీ ప‌క్క‌న‌బెట్టి ఏదో రాయ‌ల‌సీమ‌ను ఉద్ధ‌రించ‌డంకోసం ఈ ప్రాజెక్టును తెస్తున్నామ‌ని చెప్ప‌డం మోస‌పూరిత‌మ‌ని ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వ్యాఖ్యానించారు. ఇది రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కాలంనాటి ధ‌న‌య‌జ్ఞాన్ని గుర్తు చేస్తున్న‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Exit mobile version