హైదరాబాద్, ఆగస్ట్ 22 (విధాత):
Hyderabad Mega City Challenges | హైదరాబాద్ మహానగరమే! కానీ.. నిజంగానే మహా నగరమా? ఈ ప్రశ్నకు పాలకవర్గాలు సులువగానే అవునని చెబుతారు కానీ.. గుచ్చి గుచ్చి అడిగితే నీళ్లు నమలడం ఖాయం. హైటెక్ సిటీని, మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల రాత్రి వేళ సైతం ధగధగలాడిపోయే ఆకాశహర్మ్యాలను మాత్రమే చూపించి.. ఇదే మహానగరం అని ఎన్నో ఏళ్లుగా భ్రమింపజేస్తూ వచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఇప్పుడు దీన్ని వదిలేసి.. ఫ్యూచర్ సిటీ రాగం కూడా మొదలైంది. ఇవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ మహానగరమేనా? అంటే కాదు అనే చెప్పాలని అర్బన్ ఎక్సపర్ట్స్ అంటున్నారు. మహానగరంగా గుర్తింపు పొందాలంటే చేయాల్సిన ప్రధాన పనులు, కొనసాగించాల్సినవి ఆరు అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి పరిశుద్ధమైన తాగునీరు, రెండోది చెత్త కుప్పలు లేకుండా చూడ్డం, ఆ తరువాత క్రమంలో వర్షపు నీటి కాలువలు, మురుగునీరు పొంగిపొర్లకుండా ఆపడం, రోడ్లను ఆధునీకరించి ప్రజా రవాణా మెరుగుపర్చడం, నిరంతర విద్యుత్ సరఫరా చేయడం. ఈ పారామీటర్లలో చూస్తే హైదరాబాద్ గుర్తింపు ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఈ ఆరింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్పులు చేయడం. అంతే కాకుండా నిధులను కూడా వెచ్చిస్తే మహానగర పౌర జీవనానికి ముప్పు లేకుండా ఉంటుందని అంటున్నారు. ఫలితంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగై అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాలు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ వరకు కాస్త అటూ ఇటూగా మహానగరం విస్తరించి ఉన్నది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆవాసాలు రావాల్సి ఉంది. పరిశ్రమలు, ఇతర సౌకర్యాలు లేకపోవడం మూలంగా అభివృద్ధి జరగలేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నగరంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపించకుండా ఫోర్త్ సిటీ జపం చేస్తున్నారనే విమర్శలు మొదటి నుంచీ వినిపిస్తున్నవే. ఎక్కడో నగరానికి దూరంగా మరో నగరాన్ని అభివృద్ధి చేయడం అభినందించదగ్గదే కానీ కోటి మందికి పైగా నివసిస్తున్న హైదరాబాద్ లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించకుండా విస్మరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని నగర పౌర సమాజం తేల్చి చెబుతున్నది. ‘గడచిన రెండు దశాబ్ధాలుగా నగరంలో మొండి సమస్యల పరిష్కారానికి నిధులు ఆశించిన స్థాయిలో వెచ్చించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐదేళ్లు, ఆ తరువాత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పైపైన పనులు చేపట్టి జనాలకు కనికట్టు కట్టారు. గోదావరి, కృష్ణా జలాలను నగర పౌరులకు అందించేందుకు తాపత్రయ పడ్డారే కానీ లీకేజీల నివారణలో సఫలం కాలేదు. ఇప్పటికీ పలు ప్రాంతాలలో, పాతబస్తీలో కలుషిత నీళ్లు సరఫరా అవుతున్నాయి. తాగునీటి సరఫరా సామర్థ్యం పెంచిన ప్రభుత్వ పెద్దలు అదే స్థాయిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించలేదు, కొత్త ప్రాంతాల్లో విస్తరించలేదు. కోర్ ఏరియాలో గడచిన నాలుగైదు సంవత్సరాలుగా ఇప్పుడు, అప్పుడు అనే తేడా లేకుండా నిరంతరం మురుగునీరు పొంగి ప్రవహిస్తుండడం చూస్తున్నాం’ అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఆలయాలు, మసీదులు, చర్చీలు, ప్రధాన ప్రాంతాలలో మురుగు కంపు చెప్పనలవిగా ఉందని ఆయన ప్రస్తావించారు. ఉచిత నీటి సరఫరా కారణంగా మెట్రో వాటర్ సప్లయి సీవరేజి బోర్డు పనితీరు దయనీయంగా తయారైందనే అభిప్రాయాలు సర్వత్ర ఉన్నవే. ప్రతి నెలా అంతో ఇంతో చెల్లించే వినియోగదారులను చెల్లించకుండా మాజీ సీఎం కేసీఆర్ ఉచిత నీటి సరఫరా పథకం ప్రారంభించి బోర్డును ఆర్ధికంగా దెబ్బతీశారని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు సర్థుబాటు చేశారా అంటే ఏమీ లేదు. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణ, విస్తరణకు నయాపైసా విదల్చలేదని అంటున్నారు. బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మురుగునీరు రోడ్లు, కాలనీల్లో ప్రవహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాని నిధులు లేకపోవడం, అప్పులు పెరగడం మూలంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొందని జీహెచ్‌ఎంసీలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో సమస్య
వర్షం కురిసినప్పుడు వరదనీటితో మురుగునీరు కలిసి ప్రవహిస్తున్నది. ఫలితంగా నగరంలో ప్రజలు అంటురోగాలు, వ్యాధుల బారినపడుతున్నారు. వీటికి చెత్తకుప్పలు కూడా తోడవుతుండడంతో లోతట్టు ప్రాంతాలు దుర్వాసనతో కంపుకొడుతూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. రోడ్లపై రెండడుగులకు మించి నీరు ప్రవహిస్తే ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీ వాహనాలకు అత్యంత ప్రమాదం. వరదనీటి కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయని రవాణా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న, రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న ఈ వాహనాల సంఖ్యను కూడా మున్ముందు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కమిషనర్ మొదలు అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లు కనీసం వరద నీటి సమస్యకు పరిష్కారానికి చొరవ చూపించడం లేదనే విమర్శలు కాలనీ వాసుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ముప్పు ఉన్న కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి పరిష్కరించే అవకాశం ఉన్నా పట్టింపు లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట మొక్కుబడిగా తనిఖీలు చేయడం, సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసి జేబులు నింపుకోవడం సంప్రదాయంగా పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంచులు నింపుకోవడం తప్ప పౌరులకు బాధ్యతగా సేవలందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వరదనీరు, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన తరువాత రోడ్లను వేయాలి. గడచిన నాలుగైదు సంవత్సరాలుగా కనీసం గుంతలు పడ్డ రోడ్లను మరమత్తు చేసి సరిచేయడం లేదు. వీఐపీలు, ప్రధాన రోడ్లపై మళ్లీ రోడ్డు కొత్తగా వేస్తున్నారు కాని కాలనీ రోడ్ల వైపు కన్నెత్తి చూడ్డటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గుంతల రోడ్ల కారణంగా ట్రాఫిక్ జామ్ లు, చిన్న చిన్న ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన మెట్రో రైలును నడుపుతున్నారు కాని విస్తరించేందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
చినుకు పడితే కరెంట్ నిలిచిపోతుంది. మళ్లి ఎప్పుడు పునరుద్ధరిస్తారో దేవుడికే తెలియాలి. ఇక రాత్రి అయితే పలికే విద్యుత్ సిబ్బంది ఉండరు. గంటల కొద్దీ చీకట్లో ప్రజలు జాగారాలు చేయాల్సిందే. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లు వేసేందుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఏదో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో వేసి చేతులు దులుపుకొన్నారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దొంగ కరెంటు వాడకం తగ్గుతుంది, వర్షాలు పడిన సందర్భంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. వినాయక నిమజ్జనం, ఊరేగింపులు జరిగిన సందర్భంలో పౌరులకు ప్రాణనష్టం ఉండదు, రోడ్లపై ప్రైవేటు కేబుళ్లు మచ్చుకు కూడా కన్పించవు. ఇన్ని లాభాలు ఉన్నా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లను వేసేందుకు విద్యుత్ శాఖ మంత్రి శ్రద్ధకనబర్చడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఆరు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి సమగ్ర కార్యాచరణ రూపొందించుకుంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి పొందుతుందని, లేదంటే చెత్త నగరంగా శాశ్వత ముద్ర వేసుకుంటుందని నగరంలోని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇండోర్ ను చూసి నేర్చుకోవాలి
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ వరదనీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే ముందున్నది. గడచిన ఐదారు సంవత్సరాలుగా ఈ పట్టణం అనేక అవార్డులను దక్కించుకుంటూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. వర్షం కురిసిన సందర్భంలో ప్రధాన రోడ్లు, కాలనీ రోడ్లపై నీరు నిలువ ఉండకుండా పైపులైన్లు నిర్మాణం చేశారు. నాలాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఘన వ్యర్థాలు ఎక్కడా కన్పించకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చెత్త వేసేలా ఏర్పాట్లు చేసి ప్రతిరోజు ఆ చెత్తను నగర శివారుకు తరలిస్తున్నారు.