Site icon vidhaatha

Kaleshwaram Judicial Commission | కాళేశ్వరంపై కేబినెట్ తీర్మానాలు ఎక్కడ? అసలు ఉన్నాయా? మాయం చేశారా?

Kaleshwaram Judicial Commission | కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్‌కు కీలకమైన సమాచారం ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నదా? అంటే అవుననే విధంగానే రేవంత్‌ ప్రభుత్వం చర్యలు ఉన్నాయంటున్నాయి కమిషన్‌ వర్గాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం స్వయానా జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ.. అదే కమిషన్‌ అడుగుతున్న గత ప్రభుత్వంలోని క్యాబినెట్‌ తీర్మానాలను మాత్రం అందించేందుకు తటపటాయిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లేఖతోపాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల, హరీశ్ విచారణ తరువాత కమిషన్ మూడోసారి తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖకు లేఖ రాసిందని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల ప్రతులను పంపించాలని ఆ లేఖలో కోరింది. గత తొమ్మిది నెలలుగా అడుగుతున్నా ఎందుకు పంపించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలా అడిగిందల్లా ఇస్తే మున్ముందు కూడా ఇలాంటి సమాచారం అడిగే సంప్రదాయం కొనసాగుతుందని తెలంగాణ సర్కార్ పెద్దలు వాదిస్తున్నట్లు సమాచారం. అసలు సమావేశం నిర్ణయాలు, తీర్మానం ప్రతులు ఉన్నాయా, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందే అత్యంత కీలకమైన ప్రతులను మాయం చేసిందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

కాళేశ్వరంతోనే గెలిచిన కాంగ్రెస్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది. ఎన్నికలకు ముందు జరిగిన మేడిగడ్డ ప్రమాదం, అనంతరం బరాజ్‌లలో బుంగలు కాంగ్రెస్‌కు అస్త్రాలుగా మారాయి. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మూడు నెలలకు కాళేశ్వరంలో అక్రమాలను తీసేందుకు మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నియమించింది. 14 నెలలు అవుతున్నా ఇంత వరకు విచారణ ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వ సహాయ నిరాకరణ మూలంగానే కమిషన్‌కు కీలకమైన సమాచారం లభ్యం కావడం లేదంటున్నాయి అధికారవర్గాలు. జ్యుడిషియల్ కమిషన్ తన విచారణలో భాగంగా ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించిన తర్వాత.. తొలిసారి గతేడాది రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలు పంపించాలని లేఖలో కోరింది. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి బిజినెస్ రూల్స్ నివేదికలను కూడా అందచేయాలని సూచించింది. ఇవే కాకుండా ముఖ్య కార్యదర్శులు జారీ చేసిన ఉత్తర్వులు, ప్రభుత్వ స్థాయిలో జరిగిన తీర్మానాల కాపీలను కూడా అడిగింది. ఇంజినీరింగ్ అధికారుల తరువాత కమిషన్ సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా విచారించి, వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నది. వీరి విచారణ తరువాత మరోసారి కమిషన్, నీటి పారుదల శాఖకు రెండోసారి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు స్థాయిల్లో తీసుకున్న నిర్ణయాలు, ఉత్తర్వులు, నోట్ ఫైల్స్ ప్రతులను పంపించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలే మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి టీ.హరీశ్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావులను కమిషన్ విచారించింది. తమ విచారణలో మంత్రివర్గ నిర్ణయం మేరకు ప్రాజెక్టు నిర్మాణం చేశామని, ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎంపిక పై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కాంట్రాక్టర్లకు డబ్బుల చెల్లింపులో ఆర్థిక శాఖ ప్రమేయం లేదని, ప్రాజెక్టు స్థలం ఎంపికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశర్వర్ రావు పాత్ర కూడా ఉందని తెలపడంతో విచారణ మలుపు తిరిగింది.

కొత్త బాంబు పేల్చిన తుమ్మల

ఈటల రాజేందర్ ప్రకటనలో ఉలిక్కిపడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రివర్గ ఉపసంఘం వేయలేదని, తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గ ఉప సంఘంలో ఈ ప్రాజెక్టు లేనే లేదని, సంబంధమే లేదని కొత్త బాంబు పేల్చారు. కమిషన్‌కు తాను స్వయంగా లేఖ రాసి, వివరాలు తెలియచేస్తానని, మంత్రివర్గ ఉప సంఘం ఉత్తర్వులు, తీర్మానాల వివరాలను పంపిస్తానని మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారంగానే కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్‌కు తన వాదన తెలియచేస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను పంపించారు. తుమ్మల లేఖతో పాటు కేసీఆర్, ఈటల, హరీశ్ రావు విచారణలో వెల్లడించిన అంశాలపై నిగ్గు తేల్చేందుకు కమిషన్ ఈ నెల 13న నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి మూడోసారి లేఖ రాసింది. ఇప్పటి వరకు మూడుసార్లు లేఖలు రాశామని, ప్రాజెక్టు కు సంబంధించిన ప్రధాన డాక్యుమెంట్లు ఎందుకు ఇవ్వడం లేదని కమిషన్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు చేరవేశారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

సంప్రదాయంగా మారుతుందనా?

కమిషన్‌ తొమ్మిది నెలలుగా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వెనకాల కారణాలు బలంగానే ఉన్నాయంటున్నారు. కమిషన్ కోరిన విధంగా మంత్రిమండలి నిర్ణయాలు, తీర్మానాలు అందచేస్తే, మున్ముందు ఇదో సంప్రదాయంగా మారుతుందనే వితండవాదాన్ని తెరమీదికి తెస్తున్నారని సమాచారం. ఏం చేయాలనేదానిపై అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహా తీసుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలిసింది. సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్న ప్రకారం చూస్తే, మంత్రిమండలి తీర్మానాల ప్రతులు పంపించే అవకాశమే లేదంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు వాటిని ధ్వంసం చేసి వెళ్లిందని, వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారని మరికొందరు అంటున్నారు. అందువల్లే ప్రభుత్వం లేనిపోని సాకులు చూపించి, తప్పించుకునే ప్రయత్నంలో ఉందని మరికొందరు వాదిస్తున్నారు. తొమ్మిది నెలల నుంచి అడుగుతున్నా స్పందించని ప్రభుత్వం, ఇప్పటికప్పుడు స్పందిస్తుందనుకోవడం అత్యాశ అవుతుందని పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇలా సచివాలయంలో భిన్న వాదనలు విన్పిస్తుండడం విశేషం. వాదనలు ఎలా ఉన్నా, కమిషన్ కు పూర్తి వివరాలు అందే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.

Exit mobile version