Krishna Water | హైదరాబాద్, ఆగస్టు 3 (విధాత): కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలు కూడా తరలించుకుపోతున్నారని, తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతున్నదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ నాయకులు తెగ ఆందోళన పడిపోతున్నారు. ఈ రాజకీయ పక్షాల నీటిప్రేమ నిజమైనదేనా? నిజంగానే తెలంగాణకు తీరని ద్రోహం ఇప్పుడే మొదలయిందా? తెలంగాణకు జరిగిన ద్రోహంలో ఎవరి పాత్ర ఎంత? ఒక్కసారి కృష్ణా ప్రాజెక్టు కింద వాస్తవంగా జరుగుతున్నది ఏమిటో లెక్కలు తీస్తే తప్ప ఈ రాజకీయ నాయకుల ఆందోళనలో నిజమెంతో బయటపడదని సాగునీటి రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ‘నిజమే! తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగినమాట వాస్తవం. తెలంగాణ వచ్చే నాటికి ఆయా రాష్ట్రాలు వాడుకుంటున్న జలాల ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయని నీటిపారుదల నిపుణులు చెప్పేమాట. కృష్ణా పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు 299 టీఎంసీల జలాలను, ఆంధ్రకు 512 టీఎంసీలను కేటాయించారు. ఇవి తుది కేటాయింపులు కాదు’ అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణాజలాల పంపిణీపై పనిచేస్తున్నది. కొత్త ట్రిబ్యునల్ ద్వారా అదనంగా కేటాయింపులు చేయించుకోవాలంటే ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఉండాలి. కానీ తెలంగాణలో ఏం జరిగింది? ‘గతంలో కేటాయించిన 299 టీఎంసీలనే తెలంగాణ ఏ ఒక్క సంవత్సరమూ పూర్తిగా వాడుకోలేదు. వాడుకునే విధంగా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కృష్ణా నీటిలో 299 టీఎంసీల నీటిని ఉపయోగిస్తే తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ కృష్ణా నీటిని పొందే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టుల కింద మొత్తం సాగుభూమి ఎంత? ఎప్పుడయినా లెక్కలు తీశారా? సుమారు 41,60,000 ఎకరాలు. నాగార్జున సాగర్ ఎడమకాలువ (100 టీఎంసీలు), వరదకాలువ, ఎఎంఆర్‌పీ (30టీఎంసీలు), బీమా (20టీఎంసీలు), కల్వకుర్తి (30టీఎంసీలు), నెట్టెంపాడు (20టీఎంసీలు), పాలమూరు రంగారెడ్డి (90 టీఎంసీలు), కోయిల్ సాగర్, మూసీ—ఇలా అన్ని ప్రాజెక్టుల కింద సుమారు 32 లక్షల ఎకరాలకు(ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారమే) సాగునీరు ఇస్తామని ప్రాజెక్టులు మొదలు పెట్టారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకొన్ని సగంసగం పూర్తయ్యాయి. ఇంకొన్ని నత్తనడక నడుస్తున్నాయి. మొత్తం ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతున్నదో తెలుసా? అన్ని కృష్ణా ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి సాగు అవుతున్న భూమి 14 లక్షల ఎకరాలు మాత్రమే. పెట్టుబడేమో 32 లక్షల ఎకరాలకోసం పెట్టారు. సాగవుతున్నదేమో 14 లక్షల ఎకరాలు మాత్రమే. అది కూడా కాలం బాగా అయిన సంవత్సరాల్లోనే. కాలం కాస్త అటూ ఇటూ అయితే కాలువల కింద సాగుభూమి 8 లక్షల ఎకరాలకు మించదు’ అని ఒక సాగునీటి విశ్లేషకుడు వివరించారు.
కృష్ణాలో మన వాటా అని చెప్పుకొనే 299 టీఎంసీల నీటిని కూడా గత పదేళ్లలో ఏ ఒక్క సంవత్సరమూ పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి ఉందని నీటిపారుదల శాఖ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ‘మనమేమో మన వాటా వాడుకునే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ కుడికాలువ, కృష్ణా డెల్టాతోపాటు పెద్ద ఎత్తున ఎత్తిపోతలు పూర్తి చేసుకుని తనకు రావలసిన వాటా కంటే నీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది. ఇందులో తెలంగాణ పాలకుల చేతగానితనం తప్ప ఆంధ్ర ప్రాంతాన్ని తప్పుబట్టేది ఏముంది?’ అని సాగునీటి వ్యవహారాలను దగ్గరగా గమనించే ఒక జర్నలిస్టు అన్నారు. ఉదాహరణకు 2024-25 సంవత్సరంలో తెలంగాణ ఉపయోగించుకున్న కృష్ణా జలాలు 286 టీఎంసీలు కాగా, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకున్నజలాలు 718 టీఎంసీలు. 2014-15 నుంచి 2024-25 వరకు గత సంవత్సరం మాత్రమే గరిష్ఠంగా 286 టీఎంసీలు తెలంగాణ ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే 206 టీఎంసీల నీటిని తీసుకుంది. హంద్రీనీవా నుంచి 30 టీఎంసీలు తీసుకుంది. ఇవి తుంగభద్ర నుంచి తీసుకునే 60 టీఎంసీల నీటికి అదనం. ‘ఎవరిని తప్పు పడతారు? ఎవరిమీద ఎగిరెగిరి పడతారు? ఎవరి మీద ద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతుంటారు? సాగునీటి సోయి బాగా ఉందని చెప్పుకొనే బీఆర్ఎస్ గత పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నది?’ అనే ప్రశ్నలు సాగునీటి విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి మొదలుపెట్టి దాదాపు పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఏపీకి మరో వంద టీఎంసీల నీటిని తరలించుకునే అవకాశాలు ఏర్పడతాయి. మొదట తవ్విన శ్రీశైలం కుడికాలువ 11,500 క్యూసెక్కులు, రాజశేఖర్‌రెడ్డి తవ్విన మరో 44,600 క్యూసెక్కుల కాలువ, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం 34,700 క్యూసెక్కుల కాలువ-మొత్తం రోజుకు 90,800 క్యూసెక్కుల చొప్పున సుమారు ఎనిమిది టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడుతుంది. అంటే 30 రోజుల్లోనే 240 టీఎంసీల నీటిని తీసుకునే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ఒక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారానే ఏర్పాటు చేసుకుంటున్నది.
ఇంకా ఆశ్చర్యమేమంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 800 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసుకునే విధంగా నిర్మాణం చేయడం. ఇవన్నీ ఉండగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బనకచర్లకు గోదావరి నీటిని తరలించడానికి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సమస్య వందలు వేల కోట్లు ఖర్చు చేసి కొత్తకొత్త ప్రాజెక్టులు తీసుకువస్తారు. కానీ ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని పొలాలకు, చెరువులకు మళ్లించే పనులు అంటే పిల్లకాలువల నిర్మాణం మాత్రం గాలికి వదిలేస్తారు. హెడ్‌వర్కుల మీద ఉన్న ప్రేమ పిల్లకాలువలపై ఉండదు. కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు ఇద్దరికీ ఆసక్తి పెద్ద ప్రాజెక్టులపైన, భారీ బడ్జెట్‌లపైనే. రైతులు మాత్రం చకోర పక్షుల్లా నీటికోసం ఎదురు చూస్తూనే ఉంటారు. రికార్డు స్థాయిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించామని చెప్పుకునే కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు చిన్నచిన్న పనులు పూర్తిచేసే విషయం వచ్చేసరికి ఎక్కడా కనిపించరు.
కృష్ణా నదిలో తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకుంది?
2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు కృష్ణా నది జలాల్లో 299 టీఎంసీలు కేటాయించారు. అయితే కృష్ణా జలాల్లో 50:50 నిష్ఫత్తి ప్రకారం నీటిని వాడుకోవాలనే ప్రతిపాదన తెలంగాణ తెరమీదికి తెచ్చింది. కానీ, వాడుకునే వ్యవస్థ తెలంగాణకు ఉందా లేదా అన్నది నాయకులు మాట్లాడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఇంకా పూర్తి కాలేదు. ఉదయసముద్రం పూర్తిస్థాయిలో నింపే పరిస్థితి ఇంకా రాలేదు. గట్టిగా నీళ్లు వదిలితే కాలువ గట్లు కొట్టుకు పోయే పరిస్థితి. భీమా కింద కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కల్వకుర్తి కింద కూడా పిల్ల కాలువలు ఇంకా పూర్తి చేయవలసినవి చాలా ఉన్నాయి. నెట్టెంపాడు ఎప్పటికీ పూర్తి కాదు. పాలమూరు రంగారెడ్డి పనులు రెండడుగులు ముందకు మూడడుగులు వెనుకకు అన్నట్టు సాగుతాయి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్న సందర్భంలో కృష్ణాపై తలపెట్టిన ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయవలసి ఉండె. కానీ కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను బాగా నిర్లక్ష్యం చేశారు. ఎస్ఎల్‌బీసీని అసలు పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డికి కెటాయింపులే కానీ నిధులు ఇవ్వలేదు. బీమా, నెట్టెంపాడు పనులన్నీ పెండింగులోనే పెట్టారు. ట్రిబ్యునల్ తుది ఆదేశాలు వచ్చేలోపు ప్రాజెక్టులు పూర్తయితే నీటి కెటాయింపులను అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌పై పెడబొబ్బలు పెడుతూ కొరడాలు తీసుకుని ఒళ్లు చరుచుకుంటూ ఉంటే ఏమి ప్రయోజనం ఉండదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
సంవత్సరం తెలంగాణ వాడుకున్న నీళ్లు (టీఎంసీ) ఆంధ్రప్రదేశ్ వాడుకున్న నీళ్లు (టీఎంసీ)
2014-15 227.743 529.330
2015-16 69.688 124.960
2016-17 153.386 282.512
2017-18 183.298 359.897
2018-19 207.298 504.476
2019-20 278.234 653.064
2020-21 253.234 618.935
2021-22 265.051 621.841
2022-23 273.300 637.996
2023-24 120 210
2024-25 286 718