Mulugu political tussle | విధాత, ప్రత్యేక ప్రతినిధి : ములుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజుకున్న రాజకీయ కుంపటి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను చుట్టేస్తోంది. ప్రజానిరసన పేరుతో మంత్రి సీతక్క లక్ష్యంగా బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, వారి అనుచరులు ములుగుకు తరలివెళ్ళేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ములుగుకు తరలివెళ్ళిన వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క పై నిరసనను బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు విస్తరింపచేశారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు తీరుపై ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. తనను విమర్శించాలంటే ములుగు ప్రజలను సమీకరించాల్సి ఉండగా ఇతర నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తరలివచ్చి బలప్రదర్శనకు దిగడం సిగ్గుచేటన్నారు. నిరసన తర్వాత కూడా రాజకీయ వేడితగ్గకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య విమర్శల వేడికొనసాగుతోంది.
రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు
ములుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రారంభమైన రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు, నిరసనకు దారితీసింది. ములుగు కేంద్రంగా బలప్రదర్శనకు సిద్ధమై బాహాబాహికి తలపడ్డారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ ములుగులో నిరసన చేపట్టిన రోజే జిల్లాలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావుల పర్యటన చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు పోలీసుల తీరుపై విరుచుకపడ్డారు. బీఆరెఎస్ నిరసనలతో పాటు తన పై చేసిన విమర్శల పై మంత్రి సీతక్క తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు. సీతక్క తనదైన శైలిలో శాపనార్ధాలు పెట్టారు. ఆదివాసీ బిడ్డనైన నాకు మంత్రి పదవి వస్తే తట్టుకోలేక మీ కల్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, తన పైన అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క కడుపమండి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు, శాపనార్ధాలు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా నాయకులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవితలు.. సీతక్క విమర్శల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవతి విమర్శల పైన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మంత్రిగా ఉంటే డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మిమ్మల్ని రానివ్వలేదని, ఉమ్మడి జిల్లాలో పర్యటించాలంటే అడ్డంకులు సృష్టించారంటూ గుర్తు చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కీలక మంత్రిగా ఉన్న సీతక్క పై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ ప్రజా నిరసన పేరుతో ప్రారంభించిన ప్రత్యక్ష కార్యాచరణ, విమర్శలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు.