PM Modi | మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మతి- జమిలి ఎన్నికలు

మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం- ఒకే ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తామన్నారు

  • Publish Date - May 21, 2024 / 10:12 AM IST

సంకేతాలిచ్చిన ప్రధాని మోడీ
మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తాం
మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదన్న ప్రధాని
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి

విధాత: మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం- ఒకే ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో వ్యవహరించడానికి కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. ఉపాధి కల్పనలో గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వ ట్రాక్‌ రికార్డు బాగున్నదన్నారు.

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి వందరోజుల్లో ఏం చేయాలో ఇప్పటికే సలహాలు కోరిన మోడీ ఆ వంద రోజులకు మరో 25 రోజులను కలిపారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే తదుపరి ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై 100 రోజుల ప్రణాళికలను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖల మోడీ ఆదేశాలు జారీ చేశారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం

ఈసారి కూడా 100 ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని ఓవరాల్‌ రిజర్వేషన్లతో దీన్ని ముడిపెట్టరాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ నిర్మాతలు కోరుకోలేదని అన్నారు. అనేక రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానపరిచింది అన్నారు. జాతీయస్థాయిలో కూడా మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తున్నదని, దాన్ని తాను జరగనివ్వనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ కోసం కాంగ్రెస్‌ దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని ప్రధాని ధ్వజమెత్తారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదన్న ప్రధాని బీజేపీ ఎప్పుడూ వారికి వ్యతిరకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఎవరినైనా ప్రత్యేక పౌరుడిగా గుర్తించడాన్ని మాత్రం తాము అనుతించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం, లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్‌ దెబ్బతీసిందని ఆరోపించారు. అంతరిక్షం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, స్టార్టప్‌లకు సాయం, మౌలిక వసతుల కల్పన కోసం బీజేపీ భారీగా ఖర్చు చేయడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.

Latest News