Banakacharla Project | హైదరాబాద్, జూలై 15 (విధాత): రాయలసీమకు కావాల్సింది కృష్ణా జలాలే కానీ ఏపీ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసే గోదావరి జలాలు కాదని రాయలసీమకు చెందిన మేధావులు, సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. వెనుకబడిన రాయలసీమ పేరు చెప్పి మరో గుదిబండ కాగల బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఏపీ సర్కార్ ఉవ్విళ్లూరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ తరహాలో ఆంధ్ర కాళేశ్వరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏపీ రాజకీయాలలో తాను బద్ధ శత్రువుగా భావించే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ముందుకు తీసుకెళుతుంటే ప్రతిపక్ష నేత జగన్ కనీసం నోరు విప్పకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందని తేల్చిచెబుతున్నారు. సీమ పేరు చెప్పి ఏపీ ప్రజలపై ఆర్థిక భారం మోపవద్దని రాయసీమ మేధావులు ప్రభుత్వానికి హితబోధ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.
ఏపీలో అత్యంత వెనుకడిన ప్రాంతం రాయల సీమ జిల్లాలు. ఇక్కడ మొత్తం 1.07 కోట్ల ఎకరాల భూమి ఉండగా, అన్నిరకాల సాగుకు అనువైన భూమి 49 లక్షల ఎకరాల లోపే. సాగుకు అనువైన భూమి మొత్తానికి సాగునీరు అందించడానికి 400 టీఎంసీల నీరు అవసరం అవుతున్నది. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, ఎస్ఆర్‌బీసీ, తుంగభద్ర హెలెవల్ కెనాల్, కేసీ కెనాన్, ముచ్చుమర్రిల నుంచి దాదాపు 300 టీఎంసీల నీరు వస్తున్నది. ఇందులో ఒక్క శ్రీశైలం నుంచే దాదాపు 250 టీఎంసీల వరకు రాయలసీమకు సాగునీరు వెళుతున్నది. శ్రీశైలం నుంచి సోమశిల- కండలేరుకు కలిపి నెల్లూరు జిల్లాకు కూడా తీసుకువెళుతున్నారు. ఈ జలాలు కాక మహా అయితే మరో వంద టీ సీఎంల నీరు రాయలసీమ జిల్లాలకు అవసరం అవుతుంది. కేవలం వంద టీఎంసీల నీటిని రాయలసీమకు తీసుకోవడానికి బనకచర్ల అవసరం లేదన్నది రాయలసీమ మేథావులు చెపుతున్న మాట.
ఏపీ పాలకులు ఇప్పటి వరకు వివిధ దఫాలుగా రాయలసీమకు సాగు నీరు అందించడం కోసం 32 రిజర్వాయర్లు నిర్మించారు. వీటికి కృష్ణా, తుంగభద్ర జలాలు అందించడానికి దాదాపు 10 నదులు, ఉప నదులను అనుసంధానం చేశారు. కానీ.. ఆ నీటిని రైతుల భూములకు పంపించే ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను మాత్రం నిర్మించలేదు. కొన్నిచోట్ల నిర్మించినా నామ్‌కే వాస్తే అన్నతీరుగా ఉన్నాయి. రిజర్వాయర్లకు కాలువలు తవ్వకుండా, సాగు కాలువలు (డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తయారు చేయకుండా అందుబాటులో ఉన్న నీటిని ఎలా వినియోగించుకుంటారని సీమ ప్రజలు అడుగుతున్నారు. అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే వ్యవస్థను ముందుగా నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవంగా హంద్రీ..నీవా ప్రాజెక్ట్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి మొదట10 మోటర్లు బిగించారు. అయితే ఏనాడూ ఆ పది మోటర్లనూ నడిపింది లేదు. మూడు మోటర్లను ఆన్ చేసి.. వాటి నుంచి బయటకు వచ్చిన నీటిని ఎటూ తీసుకెళ్లే మార్గంలేక అలాగే వదిలేశారు. ఇక్కడ పది మోటర్లనూ వినియోగించి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏర్పాటు చేయని సర్కారు.. అవే మోటర్లను తీసుకెళ్లి, పట్టిసీమ పథకంలో వినియోగించి అక్కడ నీటిని ఎత్తిపోయడం విశేషం. హంద్రీ-నీవా కింద 4,04,500 ఎకరాలకు నీళ్లిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకూ అందులో సగం.. అంటే రెండు లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఏపీ ప్రాంత మేధావులు గుర్తు చేస్తున్నారు. జగన్ సర్కారు హయాంలో హంద్రీ-నీవా ప్రధాన కాలువకు అడ్డంగా కాంట్రాక్టర్ రోడ్డు వేసి నీరు వెళ్లకుండా అడ్డుకోవడం గమనార్హం. దీనిపై స్థానికులు అభ్యంతరాలు చెబుతూ ఆందోళనకు దిగిన తర్వాతగానీ సదరు కాంట్రాక్టర్ ఆ రోడ్డును తొలగించలేదు. ప్రధాన కాలువలు కూడా అంత ఆగమ్య గోచరంగా ఉన్నాయి.
రాయలసీమలో సాగయ్యే 49 లక్షల ఎకరాల భూమికి సరాసరి 400 టీఎంసీల నీరు అవసరం అవుతుందని సాగునీటి నిపుణుల అంచనా. ఇప్పటికే దాదాపు 300 టీఎంసీల నీటిని డ్రా చేస్తున్నందున మరో 100 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే సరిపోతుందన్న అభిప్రాయం ఏపీ మేధావుల్లో వ్యక్తం అవుతున్నది. ఇందుకోసం గోదావరి జలాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు, సాగర్ కుడికాలువ ఆయకట్టుకు అందిస్తే.. అక్కడ వినియోగించే 312 టీఎంసీల నికర జలాలను ఎగువ ప్రాంతాలు వినియోగించుకోవడానికి వీలు ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో కృష్ణాలో నికర జలాల నుంచే రాయలసీమకు నీటి కేటాయింపులు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక భారం పడదని, పైగా రాయలసీమకు నికరజలాలు అందించ వచ్చునని చెపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే చేయవలసిందల్లా నికర జలాలు కేటాయించడంతో పాటు 32 రిజ్వాయర్లనుంచి నీటిని రైతులకు అందించే విధంగా ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించడమేనని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పని చేయకుండా బనకచర్ల జపం చేయడంపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తున్నది. అలాగే గోదావరి నీటిని కృష్ణా డెల్టాతో పాటు సాగర్ కుడికాలువ ఆయకట్టుకు మాత్రమే తరలిస్తే.. అంతమేరకు ఎగువ ప్రాంతానికి కృష్ణాజలాలను వినియోగించే అవకాశం ఉంది. దీన్ని వదలి ఏకంగా రాయలసీమకే గోదావరి జలాలు తీసుకు వస్తామని, ఈ మేరకు రూ.80 వేల కోట్లతో బనకచర్ల నిర్మిస్తామని చెప్పడాన్ని ఆంధ్రా మేధావులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రైతుల కోసం కాదు.. కాంట్రాక్టర్ల కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తున్నారు. పైగా చంద్రబాబు ప్రత్యేక ఏపీకి మొదటి సీఎంగా ఉన్నప్పుడు రూ.1100 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ చేపట్టగానే నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్‌రెడ్డి నానా రభస చేశారని గుర్తు చేస్తున్నారు. నాడు పట్టిసీమను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్.. నేడు బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై మౌనంగా ఉండడంపట్ల అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మేఘా కృష్ణారెడ్డి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కావడం చేతనే జగన్ సైలెంట్‌గా ఉన్నాడన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి.
కృష్ణా జలాల్లో అదనంగా155 టీఎంసీల నికర జలాలు తమవేనంటున్న తెలంగాణ
ఏపీ సర్కారు గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే.. కృష్ణా నికర జలాల్లో సగానికిపైగా వాటా ఎగువ రాష్ట్రమైన తమకు రావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పట్టి సీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున కృష్ణా జలాల్లో 45 టీఎంసీలు ఎగువన తమకు ఇవ్వాలని అంటున్నది. అయితే ఎగువన ఉన్న రాయలసీమకు ఇస్తున్నామని నర్మగర్భంగా ఏపీ ప్రభుత్వం చెపుతున్నది కానీ ఎక్కడా కూడా రికార్డెడ్‌గా నికర జలాలు ఇస్తున్నాఇమని చెప్పడం లేదు. వాస్తవంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఏపీ ప్రభుత్వం 45 టీఎంసీలు ఇవ్వడానికి అంగీకరించాలి కానీ ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఇవి కాకుండా బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా మరో 200 టీఎంసీల గోదావరి నీటికి కృష్ణా బేసిన్ తెస్తామని ఏపీ ప్రభుత్వం చెపుతున్నది. అలాంటప్పుడు అందులో 110 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రాయలసీమకు కూడా కృష్ణా జలాల నుంచి ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం మరో 200 టీఎంసీల గోదావరి నీటికి కృష్ణా బేసిన్‌కు తరలిస్తే తెలంగాణకు కృష్ణా నికర జలాల్లో155 టీఎంసీలు న్యాయంగా రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే రాయలసీమకు 300 టీఎంసీల నీటిని తీసుకువెళుతున్నారు. ఈ మేరకు రిజర్వాయర్లు, ప్రదాన కాలువల నిర్మాణం జరిగింది. ఆ నీటిని పంట పొలాలకు తీసుకు వెళ్లేందుకు డిస్ట్రిబ్యూటరీ కాలువలు, ప్రధాన కాలువలు నిర్మించలేదు. నిర్మించినవి కూడా సరిగ్గా పనిచేయడంలేదు. ఇప్పటికే నిర్మించిన హంద్రీ-నీవా కాలువలు పాడుబడ్డాయి. ఐదారు వేల క్యూసెక్కుల నీటిని తీసుకువెళితే ఉమ్మడి అనంతపురం జిల్లా సస్యశామలం అయ్యేది. కడప, చిత్తూరు జిల్లాలు చిన్నవి. అక్కడ సాగు కూడా చాలా తక్కువ. రాయలసీమలో అనంతపురం జిల్లానే కీలకం. డిస్ట్రిబ్యూటరీపైన ఏమాత్రం శ్రద్ద పెట్టం లేదని, ఎలాంటి పనులు జరగడం లేదని రాయలసీమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు, కమిషన్ల కోసమే పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు చేపడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. వేయి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ కాలువల నిర్మాణం పూర్తవుతుందని, రాయలసీమలోని 49 లక్షల ఎకరాలకు సాగునీరు అందించ వచ్చునని సాగునీటి రంగ నిపుణులు చెపుతున్న మాట.
రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు 32
వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, అవుకు(కర్నూలు), చిన్నముక్కపల్లి, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, వామి కొండ, సర్వరాజసాగర్ (కడప), సోమశిల, కండలేరు, దుర్గంసాగర్, వెలికొండ సాగర్, కృష్ణసాగర్ (నెల్లూరు), శ్రీబాలాజీ రిజర్వాయర్, పద్మాసాగర్, శ్రీనివాస సాగర్, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి (చిత్తూరు), పెన్నాఅహోబిలం, చిత్రావతి, మిడ్‌పెన్నా రిజర్వాయర్, జీడిపల్లి, మారాల (అనంతపురం), రాళ్లవాగు, గుండ్ల బ్రహ్మేశ్వరం, నల్లమల్లసాగర్, కంచం చెరువు, తురిమెళ్ల రిజర్వాయర్ (ప్రకాశం).
అనుసంధానం చేసిన నదులు
హంద్రీ, గాలేరు, కుందు, సగిలేరు, పెన్నా, స్వర్ణముఖి, చిత్తావతి, పాపాగ్ని, మాండవి, నీవా
రాయల సీమ జిల్లాల్లో ,సాగు అయ్యే భూమి (లక్షల ఎకరాలలో)
జిల్లా | మొత్తం భూమి | సాగు అయ్యే భూమి |
అనంతపురం | 38.6 లక్షల ఎకరాలు | 26,74,681 |
కడప | 21.4 లక్షల ఎకరాలు | 6,02,509 |
కర్నూలు | 31.6 | 12,40,945 |
చిత్తూరు | 15.2 | 4,62,218 |