Policies । తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 10 నెలలు కావస్తున్నది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం (Telangana govt) వివిధ పాలసీలు రూపొందించలేక పోయింది. ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఈ ఐదేళ్లలోనే తమ పరిపాలన (administration) తీరును చూపించి తిరిగి ప్రజల మద్దతు కోరాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కారుకు ఇప్పటికే 10 నెలల గడువు అయిపోయింది. సరిగ్గా నాలుగేళ్ల రెండు నెలలు మాత్రమే ఉన్నది. ఇందులో చివరి ఆరు నెలలు తిరిగి ఎన్నికల సన్నాహాలకే (re-election preparations) సరిపోతుంది. ఎటు తిరిగీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఫలాలు అందించాల్సిన గడువు కేవలం మూడేళ్లపైనే ఉంటుంది. ఆ తరువాత ఏవైనా హడావిడిగా చేపట్టినా ప్రజలు కూడా ఎన్నికల (elections) కోసమే చేస్తున్నారన్న చర్చ చేసే ప్రమాదం ఉంది. అయితే పుణ్యకాలం గడిచిపోతున్నా.. పాలకులు వివిధ రంగాల అభివృద్ధి (development) కోసం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉంటుంది. పాలసీలు రూపకల్పన చేసి, అమలులోకి తీసుకు వచ్చిన తరువాతనే పెట్టుబడులు (investments) రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పాలసీలే రూపకల్పన చేయకపోతే దేనిని చూసి పెట్టుబడిదారులు (investors) పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు? ప్రస్తుతం తెలంగాణలో వివిధ రంగాలకు పాలసీలు లేక పోవడంతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని, వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఎనర్జీ రంగంలో పనిచేసిన ఒక సీనియర్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జర్నలిస్టులకు (journalists) ఇండ్ల స్థలాలు అప్పగించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ పాలసీ లేదని వ్యాఖ్యానించారు. పాలసీ లేకపోవడమే నాడు పాలసీగా ఉందని తాము అన్ని పాలసీలు తీసుకు వస్తామన్నారు. కానీ ఇప్పటికే ఆలస్యం అవుతోంది. ‘ఆలస్యం అమృతం విషం’ అన్న తీరుగా పాలసీల రూపకల్పనలో ఎంత ఆలస్యం అయితే పెట్టుబడుల రాక కూడా అంతే వెనుకకు పోయే ప్రమాదం ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైనా తమ ప్రాధమ్యాలకు (priorities) అనుకూలంగా పాలసీలు రూపొందించాలి. లేదా పాత పాలసీనైనా కొనసాగించాలి. ఇవేవీ చేయకపోతే ముందుకు వెళ్లడం కష్టమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ 10 నెలలుగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థిక పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు రాబట్టడానికి పారిశ్రామిక పాలసీలు (industrial policies) అవసరం అంటున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి (tourism development) టూరిజం పాలసీ, సోలార్ ఎనర్జీ పాలసీ, ల్యాండ్ పాలసీ, అర్బన్ డెబలప్‌మెంట్ పాలసీ, ఎడ్యుకేషన్ తదితర పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పాలసీలు తీసుకు రాలేక పోయింది. దీంతో ఆయా రంగాలలో పెట్టుబడులు పెట్టే వారు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
అర్బన్ డెవలప్‌మెంట్ పాలసీ అమలులోకి తీసుకురాకపోవడంతో హైదరాబాద్(Hyderabad)తోపాటు యావత్ తెలంగాణలో స్థిరాస్థి వ్యాపారం దెబ్బతిన్నది. వాస్తవానికి తెలంగాణ ఆదాయంలో స్థిరాస్థి వ్యాపారానిది పెద్ద పీట. అలాంటి రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారం బాగా పడిపోయింది. అమ్మకాలు, కొనుగోళ్లు చాలా వరకు నిలిచి పోయాయి. పాత అగ్రిమెంట్లు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోవడం మినహా కొత్తవి లేవని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెపుతున్నారు. మరో వైపు ప్రభుత్వం తాజాగా హైడ్రా (Hydra) పేరుతో చేపట్టిన కూల్చివేతలతో మధ్యతరగతి ప్రజలు హడలెత్తుతున్నారు. ప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్ పాలసీని ప్రకటించడంతోపాటు హైదరాబాద్ మహానగరంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) తీసుకురావాల్సిన అవసరం ఉందని పట్టణ నిర్మాణ రంగ నిపుణులు చెపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఐ తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న నేపథ్యంలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ధరణిపై (Dharani) ఒక్క అడుగు ముందుకేసిన రేవంత్ రెడ్డి సర్కారు.. భూమి వినియోగంపై (land utilization) పాలసీని తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. భూమి యాజమాన్య హక్కులు (land ownership rights) ధృవీకరించేలా అమెరికా, అస్ర్టేలియా దేశాలలో ఉన్న తీరుగా పాలసీలు వస్తే.. భూమి వివాదాలకు చెల్లు చీటీ ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. అప్పుడు పెట్టుబడి దారులు ఇక్కడ భూములు కొని పరిశ్రమలు పెట్టడానికి విరివిగా ముందుకు వస్తారని భూమి హక్కుల కోసం పని చేస్తున్న వారు అంటున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పర్యాటక పాలసీని తీసుకురావాల్సిన అసవరం ఉంది.
మరో వైపు సోలార్ ఎనర్జీ(solar energy)ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. కానీ రాష్ట్రంలో సోలార్ పాలసీని ఇంత వరకు రూపొందించలేదు. దీంతో రాష్ట్రంలో సోలార్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. సోలార్ ఎనర్జీపై పాలసీ ముందుకు వస్తే బీడు భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈ రంగంలో రానున్నాయి. పైగా సోలార్ ఎనర్జీ ఎంత ఉత్పత్తి అయితే మనకు వేసవి కాలంలో అంత అదనపు విద్యుత్తు అందుబాటులో మనవద్దే ఉంటుంది. కానీ సర్కారు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోక పోవడం వల్ల మనకే పరోక్షంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలసీలు తీసుకురావాలని చెపుతున్నారు. పాలసీలు తీసుకురావడం, అమలు చేయడంలో ఆలస్యం జరిగితే ఆ మేరకు రాష్ట్రాని జరిగే నష్టానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.