Rythu Bharosa | పంచాయతీ ఎన్నికలను ఇంకెంతో కాలం వాయిదావేయలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటి పోతున్నది. ఎన్నికలు వాయిదా మరికొంత కాలం వాయిదా వేస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లకు బ్రేక్ పడుతుంది. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వచ్చే నిధులు ఆపుకోవడం ఎందుకు అనే చర్చ ప్రభుత్వ పెద్దల్లో జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం మూలంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు విడుదల చేయలేదు. ఈ ఏడాది కూడా రూ.2వేల కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా పెండింగ్‌లో పెట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సమరానికి వెళ్లక తప్పడం లేదు. అయితే.. అంతకు ముందే రైతు భరోసా నిధులు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటునట్టు తెలుస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత
గ్రామ స్థాయిలో అనుకున్నంత ఈజీగా రాజకీయాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మూడు తప్ప ఏవీ అమలు కావడం లేవు. ఆ మూడు కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ కోసం సుమారు ఆరు లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఒక్క ఆర్టీసీ బస్సులలో మాత్రం ఆధార్ కార్డు చూపిస్తే ఉచిత ప్రయాణం అమలవుతున్నది. ఈలోటును భర్తీ చేసుకోవడానికా? అన్నట్టు బస్‌పాస్ చార్జీలను రెండు రోజుల క్రితం పెంచడంతో ప్రజల నుంచి వ్యతిరేక వస్తున్నది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుందని నాయకులు, కార్యకర్తలు లోలోపల అంతర్మథనం చెందుతున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో జమ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
స్థానిక ఎన్నికలకు ఎస్‌ఈసీ రెడీ
గ్రామ పంచాయతీల పదవీ కాలం 2024, జనవరి 31తో ముగియగా, జూలై నెలలో జిల్లా పరిషత్‌ల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఏ క్షణం ఆదేశించినా, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) రెండు నెలల క్రితం పూర్తి చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనుంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే రెండు మూడు రోజుల ముందు రైతు భరోసా నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.
ఈసారి ఒకే విడతలో నిధుల జమ!
గత రబీ సీజన్ (యాసంగి)లో ఎకరాకు రూ.6వేల చొప్పున ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో వేశారు. అయితే ఆ మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో కాకుండా రెండు మూడు విడతల్లో వేయడం రైతులకు ఒకింత ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే కాకుండా ఐదెకరాలలోపు ఉన్న 85 లక్షల మంది రైతులకే డబ్బులు వేశారు. అయితే ఈ ఖరీఫ్ (వానకాలం) సీజన్ లో ఒకే విడతలో రెండు లేదా మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిసింది. పది ఎకరాల లోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో భరోసా డబ్బులు ఒకేసారి వేసి స్థానిక ఎన్నికల్లో గెలుపు బాటలు వేసుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
రూ.8,760 కోట్ల చెల్లింపులకు సిద్ధం
వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం వానకాలంలో సుమారు 1 కోటి 46 లక్షల ఎకరాలకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.8,760 కోట్లు అవసరం ఉంటుంది. మహా అయితే మరో యాభై వేల ఎకరాల విస్తీర్ణం పెరగవచ్చని, వాటికి కూడా అవసరమైన నిధులు సిద్ధంగా పెట్టాలని ఆర్థిక శాఖకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇవ్వడంతో అత్యవసర చెల్లింపులు మినహా మిగతా వాటికి చెల్లింపులు నిలిపివేసింది. అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక డీఏ నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం డీఏ పై జీవో జారీ చేయనున్నది.