Site icon vidhaatha

Godavari-Banakacharla | ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీ.. ఎవరి వాదన వారిదే!

Godavari-Banakacharla | నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ బుధవారం (జూలై 16, 2025) న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. గోదావరి-బనకచర్లపై ఈ సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తమ వైఖరి ఏంటో రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రానికి ఈ లేఖ ద్వారా తెలిపింది. ఎవరికివారు తమ వాదనను ఈ సమావేశంలో వినిపించేందుకు సిద్ధమయ్యారు. గోదావరి-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం పట్టుదలగా కన్పిస్తోంది. ఈ ప్రాజెక్టును ఎజెండాగా తీసుకోవద్దని చెప్పడం ద్వారా తెలంగాణ సర్కార్ తమ వైఖరిని తేల్చేసింది. రెండు రాష్ట్రాలు తమ వైఖరిపై పట్టుదలగా ఉన్నాయి. ఏ ఉద్దేశం కోసం కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసిందో అది నెరవేరుతుందా? అనేది సర్వత్రా చర్చ సాగుతోంది.

ఎజెండా మారేనా?

బనకచర్లపై చర్చను తెలంగాణ వద్దంటోంది. ఏపీ మాత్రం చర్చను కోరుతున్నది. ఈ సమయంలో కేంద్రం ఏం చేస్తుందోనని ప్రస్తుతం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు, సమస్యలకు కారణమైన ప్రాజెక్టులు, నీటి వాటాలపై చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది. బనకచర్లపై చర్చకు ఏపీ ప్రభుత్వం పట్టుబడితే తెలంగాణ ఏం చేయనుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ అంశాన్ని ఏపీ లేవనెత్తినా తెలంగాణ కూడా బలంగా తన వాదనను వినిపించేందుకు సిద్ధమైందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ కూడా కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదలను కూడా తెరమీదికి తెచ్చింది. కృష్ణా నదిపై 200 టీఎంసీ నీటి ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందా లేదా అనేది కూడా చూడాలి.

బనకచర్లపై చర్చను తెలంగాణ ఎందుకు వద్దంటోంది?

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు నష్టమనేది రేవంత్ రెడ్డి సర్కార్ వాదన. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని గత నెలలో కేంద్ర జల్‌శక్తిమంత్రి సీఆర్ పాటిల్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, అన్ని బేసిన్ల రాష్ట్రాల సమ్మతి, సంప్రదింపులు లేకుండానే నీటి కేటాయింపులు, ప్రాజెక్టు కార్యకలాపాలను మార్చాలనే ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ నిర్వహణ బోర్డు (జీఆర్‌ఎంబీ)కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ నుంచి చట్టబద్దమైన అనుమతులు లేవనేది రేవంత్ సర్కార్ వాదన. పోలవరం నుంచి 200 టీఎంసీ వరద నీటిని మళ్లించే ప్రతిపాదన ఏకపక్షమైందని తెలంగాణ చెబుతోంది. ఇది పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేస్తుందని వాదిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై కాకుండా కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టులపై ఎజెండా అంశాలను తెలంగాణ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ కోరుతూ ఎజెండా అంశంగా పంపింది. అయితే.. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, దీనివల్ల చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతున్న కారణంగా.. ఈ ప్రాజెక్టుపై చర్చ సరైంది కాదంటోంది తెలంగాణ. ఇలాంటి ప్రాజెక్టుపై చర్చిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలపై నమ్మకం పోతుందని వాదిస్తున్నది. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని తెలంగాణ కోరుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టును అనుమతించాలని కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఏం చెబుతోంది?

గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని వాడుకొనే ఉద్దేశంతో బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. 200 టీఎంసీ గోదావరి వరద జలాలను వాడుకునేందుకే దీనిని ప్రతిపాదించినట్టు వాదిస్తున్నది. దీని ద్వారా గోదావరి జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలని భావిస్తున్నది. గోదావరి నుంచి సగటున ప్రతి ఏటా రెండు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయని, ఈ నీటిని వాడుకోవడం కోసమే ఈ ప్రాజెక్టును తెచ్చామనేది ఏపీ సర్కార్ వాదన. రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్లకు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశంగా చెబుతున్నది. నాగార్జునసాగర్ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గోదావరిలో వరద వచ్చిన సమయంలో రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసుకుంటారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు మళ్లించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వాలి. భవిష్యత్తులో తెలంగాణ వృథా నీటిని వాడుకుంటే తాము అభ్యంతరం చెప్పబోమనేది ఆ ఎన్వోసీ సారాంశం. దీనిని కేంద్రం సైతం నోటిఫై చేయాల్సి ఉంటుంది.

నీటి ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు

గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నీటి వాటాల కేటాయింపుపై స్పష్టత రాలేదు. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్ తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకంపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. అయితే.. 811 టీఎంసీల నీటిలో తమకు 50 శాతం ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కృష్ణాపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులపై కూడా ఫిర్యాదులు అందాయి. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించలతపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ వాదించింది. ఈ విషయమై కేంద్రానికి కేఆర్ఎంబీతో పాటు కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఇక పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతూనే ఉంది. కాళేశ్వరంపై ఏపీ కూడా ఫిర్యాదులు చేసింది. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని తెలంగాణ ఫిర్యాదు చేసింది. తెలంగాణ నిర్మిస్తోన్న సీతారామ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం పట్టిసీమపై తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి..

Banakacharla Controversy | ఆంధ్రా కాళేశ్వ‌రం.. బనకచర్ల! ఇక్కడా, అక్కడా మేఘా కోసమే!
Banakacharla | పోలవరం – బనకచర్ల మనకొద్దంటూ ఏపీలో ఉద్యమం.. కారణాలివే..

Exit mobile version