Telangana Cabinet | ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్‌లోని ఆశావహులు ఎదురు చూసిన రాష్ట్ర క్యాబినెట్ విస్తరణను ఎట్టకేలకు ఆదివారం.. అదీ అసంపూర్తిగా ముగించారు. ఆరు ఖాళీలు ఉండగా.. ముందుగా మూడు స్థానాల భర్తీతోనే సరిపెట్టారు. తాజా విస్తరణతో క్యాబినెట్‌లో అమాత్యుల సంఖ్య ముఖ్యమంత్రితో కలుపుకొని 15కు పెరిగింది. క్యాబినెట్ రేసులో చాలా మంది పోటీ పడినా.. తమ నేతలకు ఖాయమని వారి సన్నిహిత వర్గాలు ముందే సంబురాలు చేసుకున్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం తాను అనుకున్నవారినే ఎంపిక చేసినట్టు కనిపిస్తున్నది. ప్రత్యేకించి సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేశారు. అదే సమయంలో రెడ్డి కులం నుంచి మంత్రి పదవులు ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముద్ర తాజా విస్తరణలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఒకరు మాత్రమే సీఎంకు సన్నిహితంగా ఉండేవారన్న చర్చ జరుగుతున్నది. మిగిలినవారి ఎంపిక అధిష్ఠానానిదేనని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా వివేక్‌కు మంత్రి పదవి దక్కడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయనతోపాటు వాకిటి శ్రీహరికి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశంతోనే మంత్రి పదవులు దక్కాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇక ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం లభించిందని చెబుతున్నారు. తాజా విస్తరణ తర్వాత కూడా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో తదుపరి విస్తరణలో ఈ జిల్లాల నుంచి రెడ్డి కులానికి ఒక బెర్త్ కేటాయించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అర్ధరాత్రి వరకూ సస్పెన్స్!
తెలంగాణ మంత్రి మండలి విస్తరణలో ఎవరికి చోటు కల్పిస్తున్నారనే విషయంలో శనివారం అర్ధరాత్రి వరకూ సస్పెన్స్ కొనసాగింది. ఎప్పటికప్పుడు పేర్లు మారుతూ వచ్చాయని, అర్ధరాత్రి తర్వాత స్పష్టత వచ్చి.. మీడియాకు లీకులు ఇచ్చారని చెబుతున్నారు. కేబినెట్‌లో చోటు దక్కనున్న వారికి కూడా అర్ధరాత్రే కన్ఫర్మేషన్ ఫోన్ కాల్స్ వెళ్లినట్టు తెలుస్తున్నది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పేరు కూడా చివరి నిమిషంలోనే ఖరారైందని సమాచారం. మాలల నుంచి ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్‌కుమార్‌కు క్యాబినెట్‌లో చోటు కల్పించి.. ఆయన స్థానంలో నల్లగొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ ను నియమించాలనే ప్రతిపాదన వచ్చిందని సమాచారం. ప్రసాద్ కుమార్ అనుచరులు కూడా ఆదివారం ఉత్సవాలకు సిద్ధమైనట్టు సమాచారం. కానీ.. కొన్ని సమీకరణల వల్ల మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నట్టు చెప్పి, స్పీకర్‌గానే కొనసాగాలని అర్ధరాత్రి చెప్పడంతో ఆయన నిరాశకు గురయ్యారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసాద్‌కుమార్‌కు దక్కాల్సిన ఆ బెర్త్.. అలా వివేక్‌కు దక్కింది. రేవంత్‌రెడ్డి ప్రమేయం లేకుండా.. ఢిల్లీ పెద్దల ఆదేశంతోనే వివేక్‌కు మంత్రి పదవి దక్కిందని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. మరోవైపు విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసినా.. లాస్ట్‌మినిట్‌లో ఆమె పేరు జాబితా నుంచి పక్కకు వెళ్లిపోయిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విషయంలోనూ అధిష్ఠానమే జోక్యం చేసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం వస్తే.. చైర్మన్ పదవి ఇస్తామని శ్రీహరికి అప్పట్లో ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. దీంతో ఆ సమయంలో కూడా మల్లికార్జున ఖర్గే జోక్యంతోనే ఎమ్మెల్యే టికెట్ కూడా శ్రీహరికి వచ్చిందని చెబుతున్నారు. బీసీలలో కులపరంగా ఓట్ బ్యాంకు ఉన్న ముదిరాజ్‌లకు అతను ప్రతినిధిగా ఉంటారని, మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పడంతో రేవంత్ రెడ్డి సరేనన్నారని సమాచారం. ఆ ప్రకారంగానే ఆయన గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలి విడుతలో క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. గత ఆరు నెలల నుంచి విస్తరణ వార్తలు వచ్చినప్పుడల్లా శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపించింది. పార్టీ నిర్ణయం మేరకు మంత్రివర్గ విస్తరణలో శ్రీహరికి చోటు కల్పించడంలో ముదిరాజ్ కులం వాళ్లు ఆనందంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో మాదిగలకు రాజకీయ అవకాశం దక్కింది. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొన్ని నెలలుగా పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రిపై మాదిగలు ఒత్తిడి తెస్తున్నారు. మాదిగలను క్యాబినెట్‌లోకి తీసుకోనట్లయితే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన అధిష్ఠానం.. అడ్లూరి లక్ష్మణ్‌ను సూచించిందని సమాచారం. ప్రధాని మోదీ వల్లనే ఎస్సీ వర్గీకరణ జరిగిందనే భావనను మాదిగల్లో తుడిచివేసేందుకే లక్ష్మణ్‌కు అవకాశం ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసహనంలో మున్నూరుకాపు, యాదవులు
మున్నూరు కాపు, యాదవ కులం ప్రజా ప్రతినిధులు అసహనంతో ఉన్నారు. తమ కులానికి చెందిన ఎమ్మెల్యేలకు విస్తరణలో అవకాశం ఇస్తారని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. ఎస్సీ కులాల నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, యాభై శాతానికి పైగా ఉన్న తమకు పదవులు ఎందుకు ఇవ్వరని ఈ కులం వారు ప్రశ్నిస్తున్నారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పద్మశాలీలని, తమ కులం కాదని కాంగ్రెస్ పెద్దలకు పలుమార్లు చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మున్నూరు కాపు కులం నుంచి అవకాశం ఇవ్వాలని కోరినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో యాదవుల కులం జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోవడం లేదని ఆ కుల సంఘాల నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల మొదటి నుంచి ముస్లిం లు సానుకూలంగా ఉండడమే కాకుండా, వన్ సైడ్ ఓట్లు వేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గత దశాబ్ధకాలంగా ముస్లింలు హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం, మిగతా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించిందని, అందుకే చింది. ఈ కారణంగానే మంత్రి పదవి ఇవ్వడం లేదని, ఎంఐఎం ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
ఏడు ఉమ్మడి జిల్లాలకే ప్రాతినిధ్యం
ఉమ్మడి పది జిల్లాలలో ఏడు జిల్లాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లేరు. రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఉన్నా అవకాశం ఇవ్వలేదు. ఈ రెండు జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇస్తే, తమ పైరవీలకు, దందాలకు చెక్ పడుతుందనే ఉద్ధేశంతో చోటు ఇవ్వడం లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి కి హోం మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని అన్నారు. హఠాత్తుగా ఆయన పేరు జాబితా నుంచి మాయమైంది. అదే విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి మండలిలో స్థానం కోసం అధిష్ఠానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నట్టు వార్తలు వచ్చినా.. వారిని పార్టీ పెద్దలు పక్కన పెట్టేయడం ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.